CM Revanth Reddy:ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ సర్కార్ కీలక ప్రకటన
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారంటీలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ప్రజాపాలన పేరుతో ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) తెలిపారు. సచివాలయంలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం పొంగులేటి మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తులను గ్రామ సభల ద్వారా స్వీకరిస్తామన్నారు. అర్హత ఉన్న ప్రజలు అధికారులకు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. అనంతరం అందుకు సంబంధించిన ఓ రశీదు ఇస్తారని.. అది తప్పకుండా తీసుకోవాలని పేర్కొన్నారు. స్వీకరణ ప్రక్రియ పూర్తైన వెంటనే ఎవరు ఏ పథకానికి అర్హులో అధికారులే నిర్ణయిస్తారని చెప్పారు.
'ధరణి' ప్రక్షాళన చేస్తాం..
అలాగే గత ప్రభుత్వంలో మాదిరి సంక్షేమ పథకాల్లో కోత విధించమని స్పష్టంచేశారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పుకొచ్చారు. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తొలి రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేసి చూపించామని వివరించారు. దరఖాస్తులు అందించేందకు గ్రామ సభలకు వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా సౌకర్యాలు కల్పించాలని సీఎం ఆదేశాలిచ్చారని.. ఇందుకోసం రూ.25 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల వద్దకే పాలన అందుతుందన్నారు.'ధరణి' పోర్టల్ ప్రక్షాళనకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. గత పాలకులు ప్రభుత్వ భూములను కబ్జా చేసి రెగ్యులరైజేషన్ చేయించుకున్నారని వాటిని తిరిగి స్వాధీనం చేసుకుని ప్రజలకు పంచుతామన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదం వినపడకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కేటీఆర్‌కు పొంగులేటి కౌంటర్..
అనంతరం బీఆర్ఎస్ పాలనపై 'స్వేద పత్రం' విడుదల సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా చేశామని వారే ఒప్పుకున్నారని విమర్శించారు. సచివాలయాన్ని కూల్చి కొత్తది ఎందుకు నిర్మించారని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో చేసిన అప్పులు, తప్పులను కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలో ఎవరిపైనా కక్ష పూరిత చర్యలుండవని తప్పు చేస్తే మాత్రం వదిలి పెట్టమని తేల్చిచెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments