హైడ్రాక్సీ క్లోరోక్విన్‌తో ఉపయోగం లేదు.. ప్రాణాలు పోతున్నాయ్!
- IndiaGlitz, [Wednesday,April 22 2020]
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి చికిత్స కోసం హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ప్రపంచ దేశాలు పెద్ద ఎత్తున వాడుతున్న సంగతి తెలిసిందే. మన దేశంలో నిల్వలు ఎక్కువగా ఉండటంతో అగ్రరాజ్యం అమెరికాతో పాటు పలు దేశాలు బతిమలాడి మరీ తీసుకున్నాయ్. అయితే అసలు దీని వల్ల ప్రయోజనం ఉందా.. లేదా..? ఉంటే ఏ మేరకు ఉంది..? అని తాజాగా ఓ అధ్యయనం జరిగింది. ఇందులో ఎవరూ నమ్మలేని షాకింగ్ విషయాలు వెలువడ్డాయ్. ఈ ఔషధం వల్ల ఎలాంటి ఫలితం లేకపోగా ప్రాణనష్టం కూడా వాటిల్లుతోందని అధ్యయనం తేలినట్లు ‘మెడికల్ ప్రీప్రింట్’ అనే సైట్‌లో వివరాలను పొందుపరిచారు.
ట్రంప్ ఏమంటారో..?
అంతేకాదు.. కరోనా బారినపడి మరణించిన వారు, డిశ్చార్జ్ అయిన 368 సీనియర్ సిటిజన్ల వైద్య రికార్డులను పరిశీలించిన అనంతరం అధ్యయనకారులు ఈ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. కరోనాతో బాధపడుతున్న వారు హైడ్రక్సీక్లోరోక్విన్‌ను తీసుకోవడంతో మరణాల రేటు 28%.. యాంటీబయాటిక్ అజిత్రోమైసిన్‌తో కలిపి ఈ మందును తీసుకున్న వారిలో మరణాల రేటు 22% శాతంగా ఉన్నట్టు ఆ అధ్యయనంలో తేలడం గమనార్హం. అయితే.. ఇలాంటి తరుణంలో అగ్రరాజ్యం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారో అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కరోనా కేసుల లెక్కలు ఇవీ..
ఇదిలా ఉంటే.. ప్రపంచ వ్యాప్తంగా.. 2,585,195 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 179,839 మంది మృతి చెందారు. 705,691 మంది చికిత్స తీసుకుని కరోనాతో కోలుకున్నారు. ఇక మన దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 20,471. గడిచిన 24 గంటల్లో 1486 కొత్త కేసులు నమోదు కాగా.. 49 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో భారత్‌లో కోవిడ్ బాధితుల సంఖ్య 20,471కి చేరగా.. మరణాల సంఖ్య 652కు చేరింది. ప్రస్తుతం దేశంలో 15,859 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 5221 కేసులు నమోదు కాగా.. గుజరాత్‌లో 2272 కేసులు నమోదయ్యాయి. మూడో స్థానంలో ఉన్న ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 2156గా ఉంది.