రిపబ్లిక్ డే నాకు ఎంతో ప్రత్యేకం.. పద్మవిభూషణ్ వస్తుందని ఊహించలేదు: చిరు
Send us your feedback to audioarticles@vaarta.com
దేశంలో రాజ్యాంగం అమలైన గణంతంత్ర దినోత్సవం తనకు ఎంతో ప్రత్యేకమని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. రిపబ్లిక్ డే రోజునే తనకు దేశంలోనే రెండు అత్యుతమైన అవార్డులు వచ్చాయన్నారు. హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో రిపబ్లిక్ డే వేడుకు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో చిరంజీవితో పాటు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, హీరో వరుణ్ తేజ్, సుష్మిత కొణిదెల, చిరంజీవి మనవరాళ్లు నవిష్క, సమరలతో పాటు అభిమానులు పాల్గొన్నారు. ఈ ఏడాది చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించటంతో ఈ వేడులు మరింత ప్రత్యేకత సంతరించుకున్నాయి. జెండా వందనం చేసిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
‘దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతో మంది మహనీయుల త్యాగం వల్లే మనం ఈ రోజు ఇలా ఉండగలుగుతున్నాం.. అలాంటి త్యాగమూర్తులకు నివాళులు అర్పించుకుందాం. రిపబ్లిక్ డే నాకు చాలా ప్రత్యేకం. 45 ఏళ్ల సినీ ప్రయాణంలో నేను ఈ కళామతల్లికి సేవ చేసుకోవడం, సామాజిక బాధ్యతతో ఆయా సందర్భాల్లో కళాకారులకు సేవ చేస్తూ వచ్చాను.ఎన్నో సంవత్సరాలుగా విపత్తులు జరిగినా, అవసరార్థులకు ఆయా సమయాల్లో అండగా నిలబడ్డాను. నా వంతు సామాజిక సేవ చేసుకుంటూ వచ్చాను. అందులో భాగంగా బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేశాం. బ్లడ్ బ్యాంక్ ఎంతో మందికి స్పూర్తిగా నిలిచింది. ఈ రోజు రాష్ట్రంలో రక్తం కొరత లేదు. ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయానికి గర్వపడుతుంటాను. ఇది ఇంతగా సక్సెస్ అయిందంటే అభిమానులే కారణం. వారిని చూసుకునే నేను గర్వపడుతుంటాను. వారే లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం కావు. అందుకు కారణమైన నా బ్లడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌కి ఎప్పుడూ రుణపడి ఉంటాను.
రిపబ్లిక్ డేకి నా సేవలను గుర్తించి 2006లో పద్మ భూషణ్ ఇచ్చారు. అదే నాకు చాలా ఎక్కువ.. ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఇక ఎప్పుడూ ఎదురుచూడని, ఊహించనటు వంటి పద్మవిభూషణ్ అవార్డును ఈ ఏడాది ఇచ్చారు. ఈ అవార్డును ప్రకటించేందుకు కారణమైన ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్.. కేంద్రానికి, ప్రధానికి మోదికి ప్రత్యేక ధన్యవాదాలు. పద్మ అవార్డులు వచ్చిన వారందరికీ శుభాకాంక్షలు. జై హింద్’ అని తన ప్రసంగం ముగించారు.
ఇదిలా ఉంటే సినీ, రాజకీయ ప్రముఖులు చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొందరు నేరుగా కలిసి విషెస్ చెబితే.. మరికొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రాజమౌళి, వరుణ్ తేజ్, రాఘవేంద్రరావు, నారా రోహిత్, రాధికా, డైరెక్టర్ మారుతి, ప్రశాంత్ వర్మ, సాయి ధరమ్ తేజ.. ఇలా ఎంతో మంది పద్మవిభూషుణుడికి అభినందనలు తెలియజేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments