తెలుగు రిపోర్టర్‌కు కరోనా.. క్వారంటైన్‌కు కేంద్ర మంత్రి!

కరోనా మహమ్మారి ఎవర్నీ వదలట్లేదు. డాక్టర్లను, మీడియాను, పోలీసులను.. పేద, ధనిక అని తేడా లేకుండా అందర్నీ కాటేస్తోంది. ఇప్పటికే చెన్నై, ముంబైలో పలువురు మీడియా ప్రతినిధులకు కరోనా సోకినట్లు నిర్దారణ అయినట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఢిల్లీ తెలుగు మీడియా సర్కిళ్లలో కరోనా కలకలం సృష్టించింది. ఓ తెలుగు రిపోర్టర్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్దారణ అయ్యింది. ఆయన షుగర్ సమస్య కూడా ఉందని వైద్యులు తేల్చారట. గత కొన్నిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే సదరు రిపోర్టర్‌కు పాజిటివ్ రావడంతో ఆయన ఎవరెవర్ని కలిశారు..? ఎవరెవరితో మీడియా మీట్‌లో.. ఇంటర్వ్యూలు చేశారని అధికారులు ఆరా తీశారు. ఈ క్రమంలో ఆయన కుటుంబ సభ్యులకు టెస్ట్‌లు చేయాలని అధికారులు భావిస్తున్నారట. అంతేకాదు ఆయనతో పాటు తెలుగు మీడియా ప్రతినిధుల్లో మరికొందరికి టెస్ట్‌లు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఆ రిపోర్టర్.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ ప్రముఖ మీడియా సంస్థకు చెందిన వ్యక్తి.

హోం క్వారంటైన్‌కు కేంద్ర మంత్రి!?

ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఆ పాజిటివ్ వచ్చిన రిపోర్టర్ కేంద్ర మంత్రితో మూడుసార్లు ఇంటర్వ్యూ తీసుకున్నారని తెలుస్తోంది. మరోసారి పండ్ల మార్కెట్ ప్రారంభోత్సవం సందర్భంగా కూడా రిపోర్టర్‌ ఆ కేంద్ర మంత్రిని కలిశారట. దీంతో మరో రిపోర్టర్‌కు పాజిటివ్ అని తేలిందని తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన టెస్ట్‌లు చేయించి హోం క్వారంటైన్‌లో ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు.. ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కూడా సిబ్బంది పూర్తిగా శానిటైజ్ చేసిందని సమాచారం.

స్పందన..!

అయితే.. కలకలం రేపుతున్న ఈ వార్తలపై కేంద్ర మంత్రి సిబ్బంది స్పందించింది. మంత్రి కార్యాలయంలో సిబ్బందికి కానీ.. మరెవ్వరికీ కరోనా లక్షణాల్లేవని తేల్చింది. అంతేకాదు కేంద్ర మంత్రి హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు వచ్చిన వార్తలు కూడా అవాస్తవమేనని స్పష్టం చేసింది. కాగా.. ఆ రిపోర్టర్లకు వైద్యులు ట్రీట్మెంట్ చేస్తున్నారని.. వెంటిలేషన్ పెట్టే పరిస్థితి ఇంకా రాలేదని డాక్టర్లు మీడియాకు వెల్లడించారు. ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో తెలుగు డాక్టర్ల బృందం ఈ ట్రీట్మెంట్ చేస్తోంది. ప్రస్తుతానికి అంతా ఓకే ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెబుతున్నారు.