ఆనందయ్య మందుపై సీసీఆర్ఏఎస్కు నివేదిక..
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా నివారణకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య మందుపై ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. ఆయుష్ తన విచారణను పూర్తి చేసి పాజిటివ్ నివేదికనే ఇచ్చింది. తాజాగా ఆయుర్వేద వైద్య బృందం విచారణ పూర్తి చేసింది. ఈ నివేదికను సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఏఎస్)కు పంపింది. ఆనందయ్య మందుపై రాష్ట్ర ప్రభుత్వం ఐసీఎంఆర్‌తో పాటు ఆయుర్వేద వైద్య నిపుణులతో కమిటీ వేసింది. దీనిపై తిరుపతి ఎస్వీ ఆయుర్వేద కళాశాల, విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ సంయుక్తంగా కమిటీ ఏర్పాటైంది.
ఈ కమిటీ తాజాగా విచారణ పూర్తి చేసి సీసీఆర్ఏఎస్కు నివేదికను పంపించింది. నివేదికను పరిశీలించిన అనంతరం సీసీఆర్ఏఎస్ ఆదేశాల కోసం ఆయుర్వేద వైద్య బృందం ఎదురుచూస్తోంది. ఈ కమిటీ సభ్యులు ఆనందయ్య వద్ద మందు తీసుకున్న 570 మంది వివరాలను సేకరించారు. వీరిలో అందుబాటులోకి వచ్చిన 380 మందితో మాట్లాడారు. అయితే కమిటీ విచారణలో దాదాపు అంతా ఆనందయ్య మందుపై సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. కరోనా రాకుండా ఉండేందుకు, పాజిటివ్ వచ్చాక మందు తీసుకున్న వారు, ఆక్సిజన్ లెవల్స్ పడిపోయిన తరువాత మందు తీసుకున్న వారితో వివరంగా మాట్లాడారు.
కాగా.. జంతువులపై ప్రయోగాలకు అర్హతపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నిపుణులతో చర్చించారు. సీసీఆర్ఏఎస్ నుంచి అనుమతి వస్తే ప్రయోగాలు చేస్తామని ఇక్కడి శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రయోగాలకు తిరుపతి సమీపంలో సృజన లైఫ్ ల్యాబ్ వేదిక కానుంది. ఇప్పటికే సృజన లైఫ్ ల్యాబ్‌లో పరీక్షలకు అవసరమైన ఎలుకలు, చుంచులను సిద్ధం చేశారు.కాగా.. ఆనందయ్య మందు పరిశోధన పురోగతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి కిరణ్ రిజిజు, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ ప్రొ.బలరాం భార్గవ్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు. మందును వాడిన 570 మంది నుంచి వివరాలు సేకరించి, పరి శోధన జరుపుతున్నామని కేంద్ర మంత్రి వివరించారు. వీలైనంత త్వరలోనే పరిశోధన పూర్తి చేసి నివేదికను సిద్ధం చేస్తామన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments