మహేష్‌కి వదినగా నటిస్తున్నారనే వార్తపై రేణు దేశాయ్ క్లారిటీ..

  • IndiaGlitz, [Saturday,January 09 2021]

ప్రముఖ నటి రేణూ దేశాయ్.. బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా బిజీ అవుతూ వస్తున్నారు. ఇటీవలే ఆమె వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆ వెంటనే ఆమెకు ఆఫర్లు కూడా భారీగానే వస్తున్నాయి. అయితే తాను రీఎంట్రీ ఇవ్వనున్నట్టు పేర్కొన్న దగ్గరి నుంచి ఆ హీరోకి వదిన.. ఈ హీరోకి అక్క అంటూ ఊహాగానాలు తెగ ప్రచారంలో ఉన్నాయి. రీఎంట్రీలో ఇప్పటికే ఓ చిత్రాన్ని కంప్లీట్‌ చేసిన రేణుదేశాయ్‌.. మరో రెండు చిత్రాల కథలు విన్నట్లుగా ఇటీవల చిట్‌చాట్‌లో చెప్పుకొచ్చారు.

ముఖ్యంగా కొద్ది రోజులుగా.. టాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్‌ అవుతోన్న వార్తలపై కూడా ఈ చిట్‌చాట్‌లో ఆమె క్లారిటీ ఇచ్చారు. 'గీతగోవిందం' డైరెక్టర్ పరశురామ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రంలో మహేష్ బాబుకి వదినగా రేణు దేశాయ్ కనిపించనున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆమె చిట్‌చాట్ చేస్తున్న సమయంలో ఇదే విషయాన్ని ఓ నెటిజన్ అడగ్గా దీనికి ఆమె క్లారిటీ ఇచ్చారు.

అసలు ఈ రూమర్లు ఎక్కడి నుంచి పుట్టిస్తున్నారో తెలియడం లేదని రేణు దేశాయ్ పేర్కొన్నారు. అంతకు ముందు 'మేజర్‌'లో నటిస్తున్నానని ప్రచారం చేశారని.. ఇప్పుడు 'సర్కారు వారి పాట' అంటున్నారని వాపోయారు. నిజంగా నటిస్తే మాత్రం తానే స్వయంగా ఇన్‌స్టాలో తెలియజేస్తానని వెల్లడించారు. ఇకనైనా ఈ రూమర్లకు చెక్ పడుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం రేణు దేశాయ్ తన దర్శకత్వంలో రైతుల బాధలపై ఓ చిత్రాన్ని చేసేందుకు కథ రెడీ చేసుకుంటున్నట్లుగా ఆమె తెలిపారు.