నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు మృతి
- IndiaGlitz, [Friday,April 16 2021]
ప్రముఖ వైద్య నిపుణులు, నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు (96) కన్నుమూశారు. గత నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. కాకర్ల సుబ్బారావు 1925 జనవరి 25న కృష్ణా జిల్లా, పెదముత్తేవిలో జన్మించారు. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి వైద్య పట్టా పొందారు. అప్పటి నుంచి వైద్య రంగానికి విశేష సేవలందించారు. ఆయన అందించిన సేవలకు గాను.. 2000 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. పద్మావతి మహిళా వైద్యకళాశాల చైర్మన్‌గా పనిచేసిన ఆయన ఉస్మానియా ఆస్పత్రిలో రేడియాలజిస్ట్‌గా పని చేశారు. ఇండియా రేడియాలాజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ వారి అనుబంధ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చార్టర్ కాకర్లకు 2001 మార్చి 17న జీవితకాలపు కృషి అవార్డు ప్రదానం చేసింది. ‘నేను కేవలం ఒక్కసారి మాత్రమే గడపగలిగే ఈ జీవిత కాలంలో.. వీలైనంత ఎక్కువ మందికి మంచి చేయనివ్వండి’ అని కాకర్ల అంటుండేవారు.
అమెరికాలో సుబ్బారావు జీవితం
అమెరికాలో రేడియాలజి బోర్డు పరీక్షలలో 1955 సంవత్సరంలో కాకర్ల ఉత్తీర్ణులయ్యారు. అనంతరం న్యూయార్క్, బాల్టిమోర్ నగరాలలోని ఆసుపత్రులలో 1954-1956 సంవత్సరం వరకు పనిచేశారు. 1956 సంవత్సరంలో ఇండియా తిరిగి వచ్చి హైదరాబాద్‌లోని ఉస్మానియా వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. ఆ తరువాత ఉస్మానియా కళాశాలలోనే ప్రధాన రేడియాలజిస్టుగా కుడా పదోన్నతి పొందారు. 1970 సంవత్సరంలో సుబ్బారావు మళ్లీ అమెరికా వెళ్లారు. యునైటెడ్ కింగ్‌డమ్ వారి ఫెల్లో ఆఫ్ రాయల్ కాలేజి ఆఫ్ రేడియాలజిస్టు అనే పట్టా సంపాదించుకొన్నాడు.అమెరికా లోని అనేక ఆసుపత్రులలో పనిచేశారు. కాకర్ల సుబ్బారావు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా మెట్టమెదటి అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు కావడం విశేషం.
కేసీఆర్ సంతాపం..
నిమ్స్ మాజీ డైరక్టర్, ప్రముఖ వైద్యుడు పద్మశ్రీ డా. కాకర్ల సుబ్బారావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వైద్య రంగానికి కాకర్ల చేసిన సేవలను స్మరించుకున్నారు. నిమ్స్ డైరక్టర్‌గా ఆయన చేసిన కృషి గొప్పదని కొనియాడారు. కాకర్ల కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
చంద్రబాబు సంతాపం..
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాకర్ల సుబ్బారావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి తెలుగు ప్రజలకు తీరని లోటన్నారు. 5 దశాబ్దాలకు పైగా విశేష సేవలందించి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారన్నారు. నేటి యువతకు కాకర్ల సుబ్బారావు ఆదర్శమన్నారు. ఆయన రాసిన పరిశోధనా వ్యాసాలకు, పుస్తకాలకు అంతర్జాతీయంగా ప్రశంసలు లభించాయన్నారు. కాకర్ల కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.