AP Govt:ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట.. గ్రూప్1 పరీక్ష రద్దు తీర్పుపై స్టే..

  • IndiaGlitz, [Thursday,March 21 2024]

హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఊరట లభించింది. 2018 గ్రూప్‌1 మెయిన్స్‌ను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ తాత్కాలిక స్టే విధించింది. అనంతరం తదుపరి విచారణను మార్చి 27కు వాయిదా వేసింది. అయితే అప్పటివరకు ఉద్యోగులు తమ తమ ఉద్యోగాల్లో కొనసాగుతారని స్పష్టంచేసింది. కాగా 2018లో గ్రూప్-1 కింద 167 పోస్టుల‌కు ఏపీపీఎస్సీ(APPSC) నోటిఫికేష‌న్ ఇచ్చింది. అయితే ఎంపిక‌లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని మూడు సార్లు మూల్యాంక‌న జ‌రిగింద‌ని కొంద‌రు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.

మ‌రోవైపు హైకోర్టు ఆదేశాల‌తో డిజిట‌ల్ మూల్యాంక‌న ర‌ద్దు చేసి ఒక్కసారి మాత్రమే మాన్యువ‌ల్‌గా మూల్యాంక‌న చేశామ‌ని ఏపీపీఎస్సీ తెలిపింది. ఇరు వ‌ర్గాల వాద‌న‌లు విన్న సింగిల్ జ‌డ్జి బెంచ్ మెయిన్స్ ప‌రీక్షను ర‌ద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుతో ఈ నోటిఫికేష‌న్ కింద ఎంపికై ఉద్యోగాలు చేసుకుంటున్న వారు ఆందోళనకు గురయ్యారు. తమ ఉద్యోగాలు ఉంటాయా..? ఉండవా..? అనే సందిగ్ధంలో పడిపోయారు.

అయితే అభ్యర్థుల ప్రయోజనాలు కాపాడతామని ప్రకటించిన ప్రభుత్వం సింగిల్ బెంచ్ తీర్పును డివిజ‌న్ బెంచ్ ఎదుట స‌వాల్ చేసింది. ఈ తీర్పుపై స్టే విధించాల‌ని కోరింది. ఈ క్రమంలో మాన్యువ‌ల్‌గా ఒక్కసారే మూల్యాంక‌నం చేసిన సీసీ కెమెరా ఫుటేజీల‌ను డివిజ‌న్ బెంచ్‌కు APPSC ఆధారాలుగా స‌మ‌ర్పించింది. వీటిని ప‌రిశీలించిన డివిజ‌న్ బెంచ్.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై తాత్కాలిక స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

167 గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి 2018 మే 26న ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 1,14,473 అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 80,250 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో పేపర్-1(జనరల్ స్టడీస్) పరీక్షకు 59,697 మంది, పేపర్-2 (జనరల్ యాటిట్యూడ్) పరీక్షకు 59,200 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో మొత్తం 8,351 మంది అభ్యర్థులు ప్రధాన పరీక్షకు అర్హత సాధించారు.

డిసెంబర్ 12 నుంచి 23 వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించారు. అనంతరం ఫలితాలను వెల్లడించి, ఇంటర్వూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపికచేశారు. అయితే ఈ పరీక్షల మూల్యాంకనంపై కొంతమంది అభ్యర్థులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన సింగిల్‌ బెంచ్‌ మెయిన్స్ పరీక్ష రద్దు చేసింది. అయితే ఈ తీర్పును ప్రభుత్వం సవాల్ చేయడంతో వెళ్లడంతో డివిజన్ బెంచ్ స్టే విధించింది.