సరికొత్త చరిత్ర సృష్టించిన రిలయన్స్ ఇండస్ట్రీస్
- IndiaGlitz, [Thursday,November 28 2019]
ఇండియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ పంట పడుతోందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో!. ఆసియాలోనే అంబానీ అత్యంత సంపన్నుడిగా అవతరించిన విషయం తెలిసిందే. ఇందుకు కారణం ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు.. కర్త, కర్మ, క్రియ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్). కాగా.. అప్పుడెప్పుడో ప్రారంభమైన ఆర్ఐఎల్ ఇప్పుడు దేశ వ్యాపార చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. 10 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ విలువను దాటిన తొలి భారతీయ కంపెనీగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ఈ రోజు ట్రేడింగ్‌లో 1 శాతం పెరిగి 1,581 రూపాయల 60 పైసలకు చేరింది.
ఇక.. ఈ ఏడాదిలోనే షేర్ వాల్యూ ఏకంగా 40 శాతం పెరగడం మరో విశేషం. ఆ సంస్థ మార్కెట్ విలువ అక్టోబర్ 18వ తేదీ నాటికి 9 లక్షల కోట్ల రూపాయలుగా ఉండగా.. ఇప్పుడు 10 లక్షల కోట్ల రూపాయల మార్క్‌ను దాటేసి చరిత్ర సృష్టించింది. దీంతో.. మార్కెట్ క్యాపిటలైజేషన్లోనే అతి పెద్ద కంపెనీగా నిలిచింది. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత రెండో స్థానంలో ఉన్న టీసీఎస్‌కు మార్కెట్ విలువకు భారీ వ్యత్యాసం ఉంది... ఈ రెండు సంస్థల మధ్య దాదాపు రూ.2 లక్షల కోట్ల వ్యత్యాసం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మున్ముంథు రిలయన్స్ మరిన్ని సంచలనాలు సృష్టించినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో.