Rythubandhu: రైతుబంధు నిధుల విడుదల.. బీఆర్ఎస్‌కు లాభం చేకూరనుందా..?

  • IndiaGlitz, [Saturday,November 25 2023]

తెలంగాణ ఎన్నికలకు నాలుగు రోజుల ముందు బీఆర్ఎస్ పార్టీకి భారీ ఊరట దక్కింది. రైతుబంధు నిధుల విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వెంటనే నిధులను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే రైతుబంధు నిధుల విడుదల నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అనుమతించలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతుబంధు, ప్రభుత్వ ఉద్యోగుల డీఏల విడుదల, రైతు రుణమాఫీల కోసం నిధులు విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం ఈసీ అధికారులను విజ్ఞప్తిచేసింది. ఈ విజ్ఞప్తిని రాష్ట్ర ఎన్నికల అధికారులు సీఈసీ దృష్టికి తీసుకువెళ్లగా రైతుల ప్రయోజనాల కోసం రైతుబంధు విడుదలకు మాత్రం అనుమతి ఇచ్చింది.

అయితే ఎన్నికలకు నాలుగు రోజుల ముందు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమచేయడం బీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూరనుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం నిర్ణయం ఆ పార్టీకి గేమ్ ఛేంజర్‌గా మారనుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నువ్వానేనా అనే రీతిలో సాగుతోంది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. తాము ఆరోపిస్తున్నట్లుగానే బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటేనన్న వాదనలకు ఇది బలం చేకూర్చిందంటున్నారు.

డబ్బులు అకౌంట్ లో పడితే ఓట్లు పడతాయని ఏమైనా గ్యారంటీ ఉందా..? 2019 ఎన్నికలకు కొన్ని రోజుల ముందే ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పసుపు కుంకుమ కింద పెద్ద ఎత్తును మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. అయినా కానీ ప్రజలు టీడీపీ ఓటు వేయకుండా వైసీపీ ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించారు. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి కూడా అంతే అని.. ఇప్పటికే ఆ పార్టీని ఇంటికి పంపించాలని ప్రజలు డిసైడ్ అయిపోయారని హస్తం నేతలు వెల్లడిస్తున్నారు.