Congress Manifesto: 'పాంచ్న్యాయ్' పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. ప్రజలపై వరాల జల్లు..
- IndiaGlitz, [Friday,April 05 2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ప్రకటించింది. దేశ ప్రజలకు వరాల జల్లు కురింపించింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలు ఈ మేనిఫేస్టోను విడుదల చేశారు. పాంచ్ న్యాయ్, పచ్చీస్ గ్యారెంటీల పేరుతో విడుదల చేసిన ఈ మేనిఫేస్టోలో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసింది. యువత, మహిళలు, రైతులే లక్ష్యంగా రూపొందించిన మేనిఫోస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలను చేర్చింది.
ఎన్డీఏ ప్రభుత్వం గత పదేళ్లలో పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా పెరిగాయని.. తాము అధికారంలోకి రాగానే ధరలను తగ్గిస్తామని పేర్కొంది. సైనిక నియామకాల విషయంలో ఇటీవల తీసుకొచ్చిన అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. మహాలక్ష్మీ పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తామంది. అలాగే మహిళలకు ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని.. రైతులను ఆకట్టుకోవడం కోసం కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని వెల్లడించింది. అంతేకాకుండా వ్యవసాయ పరికరాలకు జీఎస్టీ మినహాయింపు కల్పించే అంశాన్ని సైతం మేనిఫెస్టోలో చేర్చింది.
రిజర్వేషన్లపై ప్రస్తుతం ఉన్న 50% పరిమితిని తొలగిస్తామని కూడా హామీ ఇచ్చింది. అలాగే రూ.5000 కోట్లతో యువతకు స్టార్టప్ ఫండ్, నిరుద్యోగ భృతి, విద్యా రుణాల వడ్డీ రేటు తగ్గింపు, చిన్నతరహా పరిశ్రమల రుణాల మాఫీ, తక్కువ వడ్డీకి రుణాల పంపిణీతో పాటు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పుకొచ్చింది. దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని.. 8 కోట్ల కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులు పంపిణీ చేస్తామని స్పష్టంచేసింది. రైల్వేల ప్రైవేటీకరణను నిలిపివేస్తామని.. యువతకు 30 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది.
ఇక రూ.450కే వంట గ్యాస్ సిలింబర్ పంపిణీ చేస్తామని.. ఉపాధి హామీ వేతనం రూ. 400 చేస్తామని పేర్కొంది. అలాగే ప్రభుత్వ పరీక్షలు, ప్రభుత్వ పోస్టులకు దరఖాస్తు ఫీజులను రద్దు చేస్తామంది. నేషనల్ జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు, హైకోర్టులలో ఖాళీల భర్తీ 3 ఏళ్లలో పూర్తి చేస్తామని వరాల జల్లు కురిపించింది. తెలంగాణ, కర్ణాటక ఎన్నికల మాదిరిగానే గ్యారంటీల పేరుతో ఈ మేనిఫెస్టోను రూపొందించింది.