నాగచైతన్య తొలి వెబ్ సిరీస్ రిలీజ్ ఎప్పుడంటే..?

  • IndiaGlitz, [Wednesday,November 15 2023]

ప్రస్తుతం ఓటీటీల పట్ల ప్రజలు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇంట్లో కూర్చుని కుటుంబంతో కలిసి ప్రశాంతంగా నచ్చిన మూవీ/వెబ్ సిరీస్ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. దీంతో ఓటీటీల్లో కంటెంట్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీనిని క్యాష్ చేసుకునేందుకు పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. అలాగే స్టార్ హీరోలు కూడా వెబ్ సిరీస్‌లు చేసేందుకు ముందుకొస్తున్నారు. ఇటీవల రానా, వెంకటేశ్ కలిసి 'రానా నాయుడు' అనే వెబ్ సిరీస్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అక్కినేని నాగచైతన్య కూడా ఓ వెబ్ సిరీస్‌లో నటించాడు.

డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'దూత' అనే వెబ్ సిరీస్ చేశాడు. మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌గా ఉండబోతుంది. చైతూ మొదటిసారి ఈ జోనర్‌లో చేస్తుండటంతో అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్‌ని మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనున్నట్టు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో చైతూ జర్నలిస్టుగా కనిపించనున్నారు.

ఇక చందు మొండేటి దర్శకత్వంలో చైతూ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో క్యూట్ హీరోయిన్ సాయి పల్లవి చైకు జంటగా నటిస్తుంది. ఉపాధి కోసం సముద్రంలో వేటకు వెళ్లిన శ్రీకాకుళం మత్స్యకారులు పాకిస్తాన్ కోస్ట్‌గార్డులకు చిక్కడం.. ఆ తర్వాత ఏం జరిగిందనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలోని పాత్ర కోసం చైతూ ఇప్పటికే పూర్తిగా మేకోవర్ అయ్యాడు.