Aadudam Andhra: 'ఆడుదాం ఆంధ్రా' పోటీలకు రిజిస్ట్రేషన్లు షూరూ.. వివరాలు ఇవే..
Send us your feedback to audioarticles@vaarta.com
సీఎం జగన్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. యువతను క్రీడారంగంలో ప్రోత్సహించేలా 'ఆడుదాం ఆంధ్రా' ప్రోగ్రామ్‌కు నడుం బిగించింది. క్రీడల ద్వారా గ్రామ స్థాయి నుంచి ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం, ప్రతిభను గుర్తించి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పోటీపడేలా తీర్చిదిద్దడం ఈ కార్యకమం ముఖ్య ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది. 50రోజుల పాటు జరగనున్న ఈ క్రీడాపోటీలకు రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పలు క్రీడల్లో పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. గ్రామ/వార్డు సచివాలయ స్థాయి నుంచి ఐదు దశల్లో పోటీలను నిర్వహించనుంది. 15ఏళ్లు పైబడిన వయసున్న బాలబాలికలు అందరిని పోటీలలో భాగస్వాముల్ని చేసేలా 'ఓపెన్ మీట్' పోటీలు చేపడుతుంది.
మొత్తం 2.99లక్షల మ్యాచ్‌లు..
తొలి దశ పోటీలలో భాగంగా 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో మొత్తం 1.50లక్షల మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఇందులో విజేతలుగా నిలిచిన వారు తర్వాత మండల స్థాయిలో పోటీపడతారు. 680 మండలాల్లో మొత్తం 1.42లక్షల మ్యాచ్‌లు ఉంటాయి. ఈ దశలో గెలుపొందిన జట్లను నియోజవకర్గ పోటీలకు పంపిస్తారు. 175 నియోజకవర్గాల్లో 5,250 మ్యాచ్‌లలో పోటీలు నిర్వహిస్తారు. వీటిల్లో సత్తా చాటిన వారు జిల్లా స్థాయికి ఆడాల్సి ఉంటుంది. 26 జిల్లాల్లో 312 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. జిల్లా స్థాయి విజేతలతో రాష్ట్ర స్థాయిలో 250 మ్యాచ్‌ల్లో పోటీపడేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు.
ఒకే వేదికపై 50రోజుల పాటు పోటీలు..
గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలో 34.20లక్షల మంది, మండల స్థాయిలో 17.10లక్షల మంది, నియోజకవర్గ పోటీల్లో 77,520 మంది, జిల్లా స్థాయిలో 19,950 మంది, రాష్ట్ర స్థాయిలో 2,964 మంది 'ఆడుదాం-ఆంధ్ర' క్రీడల్లో ప్రాతినిధ్యం వహిస్తారని అంచనా వేస్తున్నారు. వివిధ దశల్లో కలిపి మొత్తం 52.31లక్షల మంది ఒకే వేదికపై 50 రోజుల పాటు పోటీల్లో పాల్గొననున్నారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా..
క్రీడాచరిత్రలో కనివీని ఎరగని రీతిలో 15 ఏళ్లకు పైబడిన క్రీడాకారులు సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయంలో, వాలంటీర్ల ద్వారా, ఆన్‌లైన్‌లో aadudamandhra.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా పేర్లను నమోదు చేసుకోవచ్చు. గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో డిసెంబర్ 15 నుంచి ఫిబ్రవరి 3 వరకు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ డబుల్స్, కబడ్డీ, ఖోఖోతో పాటు సంప్రదాయ యోగ, టెన్నీకాయిట్, మారథాన్ అంశాల్లో పోటీలు జరుగుతాయి. ఇప్పటికే క్రీడా సామగ్రిని జిల్లాలకు తరలించామని అధికారులు తెలిపారు. పోటీల్లో విజేతలకు సర్టీఫికెట్లు, ట్రోఫీలు, పతకాలతో సత్కరించనుంది. అలాగే నియోజవకర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయి విజేతలకు ప్రత్యేక నగదు బహుమతులు ఇవ్వనున్నారు. ఇక తుది దశ పోటీలను విశాఖలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments