ఇదే తొలిసారి ..చివ‌రిసారి: రెజీనా

  • IndiaGlitz, [Monday,March 09 2020]

ఎస్‌.ఎం.ఎస్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌ల‌క‌రించిన చెన్నై సొగ‌స‌రి రెజీనా క‌సండ్ర కొత్త ట‌ర్న్ తీసుకున్నారు. హీరోయిన్‌గానే కాదు.. పాత్ర న‌చ్చితే నెగిటివ్ షేడ్స్ ఉన్న సినిమాలు చేయ‌డానికి కూడా ఓకే అంటున్నారు. 7, అ! వంటి సినిమాల్లో వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో ఆమె అల‌రించారు. ఇప్పుడు తొలిసారి ఓ స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించ‌బోతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించ‌ని రెజీనా తొలిసారి స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించ‌డానికి కార‌ణమెవ‌రో తెలుసా? మెగాస్టార్ చిరంజీవి. ఆయ‌న హీరోగా కొర‌టాల శివ తెర‌కెక్కిస్తోన్న చిత్రం ఆచార్య‌. ఈ సినిమాలో చిరుతో రెజీనా ఓ స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించార‌ట‌. ఈ విష‌యాన్ని ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో ధృవీకరించారు.

‘‘చిరంజీవిగారి సినిమాలో స్పెషల్ సాంగ్ అనగానే నేను మరో ఆలోచ‌న లేకుండా ఓకే చెప్పేశాను. ఆయ‌న‌తో డాన్స్ చేయ‌డం చాలా క‌ష్టం. ఆయ‌న డాన్స్ చేయ‌డంతో పాటు అద్భుత‌మైన హావ‌భావాల‌ను ప‌లికిస్తారు. ఆయ‌న తాజా చిత్రంలో ఆరు రోజుల పాటు చిత్రీక‌రించిన స్పెష‌ల్ సాంగ్‌లో చేయ‌డం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయ‌న నా డాన్స్ చూసి అభినందించ‌డం మ‌రింత ఆనందంగా అనిపించింది. ఈ పాట‌ను ఐటెమ్ సాంగ్ అన‌డం కంటే సెల‌బ్రేష‌న్స్ సాంగ్ అనొచ్చు. ఇలా స్పెష‌ల్ సాంగ్ చేయ‌డం ఓ ర‌కంగా కొత్త అనుభూతే. అయితే ఇదే తొలిసారి... చివ‌రిసారి కూడా.ఇక‌పై స్పెష‌ల్ సాంగ్స్‌లో నటించ‌ను’’ అన్నారు రెజీనా.