రికార్డ్ రేటుకు ‘బాలాపూర్ లడ్డూ’ వేలం!
- IndiaGlitz, [Thursday,September 12 2019]
వినాయక చవితి అంటే టక్కున గుర్తొచ్చేది.. ఖైరతాబాద్ మహాగణపతి.. ఆ తర్వాత బాలాపూర్ గణపతి లడ్డూ. నిమజ్జనం అయ్యేలోపు ఒక్కసారైనా గణపతిని చూడటానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఎక్కడెక్కడ్నుంచో వస్తుంటారు. అయితే నిమజ్జనం రోజున స్వామికి నైవేద్యంగా సమర్పించే లడ్డూలను వేలంలో దక్కించుకోడానికి పెద్ద ఎత్తున పోటీ పడుతుంటారు. ఈ వేలం పాటలో కేవలం తెలంగాణ నుంచే కాకుండా.. ఏపీతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన వారు తరలివస్తుంటారు.
కాగా.. గురువారం నిమజ్జనాలకు చివరి రోజు కావడంతో బాలాపూర్ లడ్డు వేలం పాట పాడారు. 21 కిలోల బరువున్న ఈ లడ్డూనూ గతేడాది కంటే ఎక్కువ ధర దాటింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకర్గానికి చెందిన కొలను రామిరెడ్డి రూ.17.67 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. మూడేళ్ల నుంచి ప్రయత్నిస్తున్న ఆయన ఈ ఏడాది మాత్రం లడ్డూను ఎట్టకేలకూ దక్కించుకున్నారు. గతేడాది బాలాపూర్ మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా రూ.16.60 లక్షలకు లడ్డూ వేలం పాడారు.
అయితే గతేడాది కంటే అదనంగా రూ.లక్ష చెల్లించి బాలాపూర్ లడ్డును రామిరెడ్డి సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. బాలాపూర్ లడ్డూ వేలం ప్రారంభమై నేటికి 26 ఏళ్లు కావడం విశేషమని చెప్పుకోవచ్చు. కాగా.. రికార్డు స్థాయిలో ధర పలికి.. చరిత్ర సృష్టించిన బాలాపూర్ లడ్డూ వేలం తొలిసారి 1994లో ప్రారంభమైందన్న సంగతి తెలిసిందే.