Krishnam Raju: అసలు కృష్ణంరాజు మరణానికి కారణమేంటీ..?
- IndiaGlitz, [Sunday,September 11 2022]
తెలుగు చిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్‌గా, అలనాటి అగ్రనటుల్లో ఒకరిగా విశేష ప్రజాదరణ వున్న కృష్ణంరాజు మరణంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ తెల్లవారుజామున హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. అయితే కృష్ణంరాజు అనారోగ్యంతో చనిపోయారంటూ వార్తలు వచ్చాయి తప్పించి.. కారణమేంటనేది మాత్రం ఎక్కడా రాలేదు. ఈ క్రమంలో ఏఐజీ ఆసుపత్రి వర్గాలు స్పందించాయి.
కృష్ణంరాజు మధుమేహం, పోస్ట్ కోవిడ్, గుండెపోటు కారణంగా చనిపోయారని వైద్యులు తెలిపారు. గుండె కొట్టుకునే వేగంలో సమస్యలతో పాటు రక్తప్రసరణ సరిగా లేకపోవడం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యంతో కృష్ణంరాజు బాధపడుతున్నారని డాక్టర్లు వెల్లడించారు. ఈ క్రమంలో పోస్ట్ కోవిడ్ సమస్యలతో ఆగస్ట్ 5న తమ ఆసుపత్రిలో చేరారని.. తీవ్రమైన న్యూమోనియా వుండటంతో పాటు కిడ్నీ పనితీరు పూర్తిగా మందగించడంతో నాటి నుంచి ఆయనను వెంటిలేటర్‌పైనే వుంచినట్లు వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున 3.16 గంటలకు తీవ్రమైన గుండెపోటు రావడంతో కృష్ణంరాజు కన్నుమూసినట్లు ఏఐజీ ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.
మరోవైపు కృష్ణంరాజు మరణంతో టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం కృష్ణంరాజు పార్ధివ దేహాన్ని ఇంటికి తరలించనున్నారు. అనంతరం ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం అందుబాటులో వుంచి, సోమవారం హైదరాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.