మే-03 వరకూ లాక్‌డౌన్ పొడిగింపు వెనుక 3 కారణాలు..!
- IndiaGlitz, [Tuesday,April 14 2020]
యావత్ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే-03 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. అంటే మరో 19 రోజుల పాటు లాక్‌డౌన్ ఉండనుంది. మంగళవారం ఉదయం 10 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా కరోనాపై పోరాటానికి మద్దతుగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కరోనాపై భారత యుద్ధం బలంగా సాగుతోందన్నారు. కష్టమైనా.. నష్టమైనా దేశం కోసం ప్రజలు నిలబడ్డారని ఈ సందర్భంగా మోదీ స్పష్టం చేశారు. అయితే.. అసలు మే-03 వరకు ఎందుకు పొడిగించినట్లు..? ఏప్రిల్-30వరకు కాకుండా మే-03వరకే ఎందుకు పొడిగించారు..? దీనివెనుక అసలు కారణాలేంటి..? అనేదానిపై ప్రస్తుతం యావత్ దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ముందు చూపుతోనే ఇలా..!
ఇదిలా ఉంంటే.. వాస్తవానికి ఏప్రిల్-30వరకే అనుకున్నప్పటికీ మే-03 వరకు లాక్‌డౌన్ పొడిగించటం వెనుక మూడు కారణాలున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకునే చూపుతోనే మోదీ వ్యవహరించారని చెప్పుకోవచ్చు. మే-01న కార్మికుల దినోత్సవం దీంతో ఆ రోజు హాలీడే. ఆ తర్వాత మే-02న శనివారం, మే-03న ఆదివారం ఈ రెండు రోజులు వారాంతపు సెలవులే. సో.. కార్మికుల దినోత్సవం రోజున జనాలు గుమిగూడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారాంతం కావడంతో కూడా సెలవులు వచ్చాయని జనాలు రోడ్ల మీదికొచ్చే అవకాశాలు ఉన్నాయి. జనాలు ఎక్కువగా గుమిగూడితే కరోనా సోకే ప్రమాదం మెండుగా ఉంది. అందుకే వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మోదీ మే-03వరకు ప్రకటించినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
ముందున్నాం..!
కాగా.. దేశం కోసం తమ కర్తవ్యాన్ని సంపూర్ణంగా నిర్వహిస్తున్నారన్నారని ప్రధాని మెచ్చుకున్నారు. కరోనా కట్టడికి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని.. ఇతర దేశాలతో పోల్చితే మన దేశం కరోనా కట్టడిలో ముందుందన్నారు. 21 రోజుల లాక్‌డౌన్‌ను దేశం సమర్థంగా అమలు చేసిందని మెచ్చుకున్నారు. ఇతర దేశాల్లో మన కంటే 20, 30 శాతం ఎక్కువ కేసులు ఉన్నాయన్నారు.