Balineni: పొమ్మనలేక పొగ పెడుతున్నారా..? బాలినేని ఉక్కపోతకు కారణాలేంటి..?
- IndiaGlitz, [Friday,October 20 2023]
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పరిచయం అక్కర్లేని పేరు. సీఎం జగన్ దగ్గరి బంధువుతో పాటు ఒంగోలు నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్‌తోనే ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన బాలినేని.. 2019లో మాత్రం గెలుపొందారు. దీంతో జగన్ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇటు మంత్రిగా, అటు ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా జిల్లాలో హవా కొనసాగించారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి కోల్పోయారు. ఎప్పుడైతే ఆయన మంత్రి పదవి నుంచి దిగిపోయారో అప్పటి నుంచే జిల్లాలో బాలినేని ప్రాధాన్యత తగ్గుతూ వస్తుంది.
తన మాటకి విలువ లేకుండా పోయిందని ఆవేదన..
మంత్రి పదవి పోయిన దగ్గరి నుంచి జిల్లాలో జగన్ మరో సమీప బంధువు వైవీ సుబ్బారెడ్డి హవా పెరిగింది. ఇటీవల తనపై లేనిపోని అవినీతి ఆరోపణలు చేస్తున్నారని.. పార్టీలో ఉంటూనే తన వెనక గోతులు తీస్తున్నారని బాలినేని కంటతడి కూడా పెట్టుకున్నారు. ఆ వెంటనే బాలినేని, సుబ్బారెడ్డిని సీఎం జగన్ తన ఆఫీసుకు పిలిపించుకుని ఇద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నం ఫలించలేదు. తాజాగా ఒంగోలులో నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాల స్కాం వెలుగు చూసింది. ఇందులో నిందితులు బాలినేని అనుచరులన్న ప్రచారం జరిగింది. దీంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురైన బాలినేని.. తన రాజకీయ జీవితంలో ఇంతటి క్షోభకు ఎప్పుడూ గురి కాలేదని వాపోయారు. పార్టీలో, ప్రభుత్వ అధికారుల వద్ద తన మాటకి విలువ లేకుండా పోయిందని సన్నిహితుల వద్ద బాలినేని అసహనం వ్యక్తం చేశారు.
బాలినేని ముఖ్య అనుచరులు సస్పెండ్..
ఇటీవల బాలినేని ముఖ్య అనుచరులైన భవనం శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డిని పార్టీ సస్పెండ్ చేసింది. పర్చూరు, మార్కాపురం నియోజకవర్గాల్లో కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు. కనీసం తనకు సమాచారం కూడా ఇవ్వకుండానే సస్పెండ్ చేయడంపై బాలినేని తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తనకు చెప్పకుండా ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించిన బాలినేని.. 48 గంటల్లోగా తన అనుచరులను తిరిగి పార్టీలోకి తీసుకోవాలని డెడ్‌లైన్ విధించారు. కానీ ఆ హెచ్చరికను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో బాలినేని మరింత ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే బాలినేని తన గన్‌మెన్లను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
పార్టీలో ప్రాధాన్యత తగ్గిస్తున్నారనే అనుమానాలు..
ఈ పరిణమాల నేపథ్యంలో బాలినేని తాడేపల్లి నుంచి పిలుపువచ్చింది. హైదరాబాద్ నుంచి పోలీస్ ఎస్కార్ట్, గన్‌మెన్లు లేకుండానే ఆయన తాడేపల్లి చేరుకున్నారు. ముందుగా సీఎంవో ముఖ్య కార్యదర్శి ధనుంజయ్ రెడ్డిని కలుసుకుని మాట్లాడారు. నకిలీ స్టాంప్స్ కుంభకోణంలో తన ప్రమేయం లేకున్నా తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. భూ కబ్జా దోషులను పట్టుకోవాలని,. తన అనుచరులు ఉన్నా చర్యలు తీసుకోవాలని ధనుంజయ్ రెడ్డికి తెలిపారు. ఈ కేసులో నిస్ఫాక్షికంగా వ్యవహరించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించాలని బాలినేని కోరినట్లుగా తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో బాలినేనికి సీఎం జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోడం తీవ్ర చర్చనీయాంశమైంది. తాను కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్నానని అందుచేత ధనుంజయ్ రెడ్డిని కలవాలని జగన్ చెప్పినట్లుగా సమాచారం. దీంతో ఆగ్రహంతో రగిలిపోతున్న బాలినేని.. తనకు కావాలనే పార్టీలో ప్రాధాన్యత తగ్గిస్తున్నారనే అంచనాకు వచ్చేశారు. పార్టీ నుంచి పొమ్మనలేక పొగ పెడుతున్నట్లుగా వ్యవహరిస్తున్నారని అనుచరుల వద్ద వాపోతున్నట్లు తెలుస్తోంది.
పార్టీ మారలేక.. పార్టీలో ఉండలేక..
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అండతో రాజకీయాల్లోకి వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి పక్కా కాంగ్రెస్ వాదిగా ముద్రపడ్డారు. వైఎస్ అకాల మరణంతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జగన్ వైసీపీ పార్టీ పెట్టారు. దీంతో కాంగ్రెస్ పార్టీతో పాటు మంత్రి పదవికి రాజీనామా చేసిన బాలినేని.. జగన్‌కు అండగా నిలబడ్డారు. అప్పటి నుంచి వైసీపీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. కానీ ఇప్పుడు మాత్రం తనను పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు కుట్ర చేస్తున్నారని బాలినేని భావిస్తు్న్నారు. కాంగ్రెస్, వైసీపీలో ఉన్న ఆయన టీడీపీ నేతలకు బద్దశత్రువుగా మారారు. ఒంగోలులో మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తో ఢీ అంటే ఢీ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆయన టీడీపీలోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు జనసేనలోకి వెళ్దామనుకున్న ఆ పార్టీ క్యాడర్ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారలేక.. పార్టీలో ఉండలేక తీవ్ర ఉక్కపోతను ఎదుర్కొంటున్నారు. మరి బాలినేని రాజకీయ భవిష్యత్ ఎటు వైపు సాగుతుందో తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.