వైఎస్ జగన్ పాదయాత్ర సక్సెస్‌కు కారణమిదే..
- IndiaGlitz, [Wednesday,January 09 2019]
వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజా సంకల్ప యాత్ర' నేటితో శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో ముగియనుంది. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టాయి. పాదయాత్ర ముగింపునకు ఎంపీలు.. మొదలుకుని ద్వితియ శ్రేణి నేతల వరకూ ఇచ్ఛాపురంకు క్యూ కట్టారు. ఈ క్రమంలో పలువురు పార్టీ నేతలు, ప్రముఖులు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్‌తో తమకున్న అనుబంధాన్ని చెబుతూ.. పాదయాత్ర ఇంతలా సక్సెస్ కావడానికి కారణాలు చెప్పుకొచ్చారు.
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటే టక్కున గుర్తొచ్చే నటుడు పృథ్వీ వైసీపీలో క్రియాశీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. జగన్‌ను ఎవరైనా విమర్శిస్తే చాలు కౌంటర్ ఇచ్చి దుమ్ముదులపడంలో.. 40 ఇయర్స్ అని చెప్పుకునే చంద్రబాబుకు సైతం దిమ్మదిరిగేలా మాట్లాడటంలో పృథ్వీ ముందుంటారు. పాదయాత్ర ముగింపురోజున మీడియాతో మాట్లాడిన ఆయన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దేశ చరిత్రలో ఏ కుటుంబం కూడా వైఎస్సార్ కుటుంబంలా పాదయాత్ర చేయలేదని పృథ్వీ చెప్పుకొచ్చారు.
జగన్ పాదయాత్ర విజయవంతం కావడానికి ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. తమ సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వాన్ని ఓటుతో సాగనంపేందుకు ప్రజలు సిద్ధమై ఎన్నికల కోసం వేచి చూస్తున్నారన్నారు. సమస్యలు తీర్చే ప్రజా నాయకుడు తమ ముందుకు వచ్చాడన్న నమ్మకం ప్రజల్లో వచ్చిందన్నారు. పాదయాత్రతో మహానేత వైఎస్సార్ లేని లోటును జగన్ తీరుస్తారన్న భరోసా జనానికి కలిగిందన్నారు. ప్రజాసంకల్పయాత్రలో లక్షలాది మంది స్వచ్ఛందంగా ప్రతిరోజు జగన్ వెంట నడిచారని థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ అన్నారు.