టీటీడీ ఆన్లైన్ సేవల వెబ్సైట్ మార్పు వెనుక..!
- IndiaGlitz, [Saturday,May 23 2020]
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు ఆన్లైన్ సేవలు కూడా అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఇందుకుగాను వెబ్ సైట్ ద్వారా దర్శనం టికెట్లు బుక్ చేసుకోవడం.. లడ్డూలు సైతం బుక్ చేసుకునేందుకు అవకాశం ఉండేది. ttdsevaonline.comలో ఇలా బుకింగ్స్ చేసుకునే వీలుండేది. అయితే తాజాగా ఆ వెబ్సైట్ను tirupatibalaji.ap.gov.inగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు సైతం టీటీడీ బోర్డు నుంచి జారీ అయ్యాయి. ఇదివరకు స్వతంత్రంగా ఉన్న టీటీడీ వెబ్ సైట్ను ప్రభుత్వ సైట్కు అనుబందంగా మారుస్తున్నట్టు కీలక ప్రకటన చేశారు.
మార్పు వెనుక కారణం ఇదీ..
ఈ మధ్యకాలంలో టీటీడీ పేరుతో పలు ఫేక్ సైట్లు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొందరు హ్యాక్ చేసి మార్పులు చేర్పులు చేసేయడం తద్వారా భక్తులు ఇబ్బంది పడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి. దీనిపై ప్రతిపక్ష పార్టీలు నానా యాగీ కూడా చేశాయి. అందుకే ఇలాంటి వాటిని కట్టచేయడానికి టీటీడీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అంటే ఇక ఈ వెబ్సైట్ ప్రభుత్వమే చూసుకుంటుందన్న మాట.
ఇక నుంచి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆర్జితసేవలు, దర్శనం, బస, కల్యాణమండపాలు తదితర ఆన్లైన్ సేవలను బుక్ చేసుకోవడంతోపాటు ఈ-హుండీ, ఈ-డొనేషన్స్ సౌకర్యానికి గాను tirupatibalaji.ap.gov.in వాడుకోవాల్సి ఉంటుంది. కాగా ఇకపై ttdsevaonline.com పనిచేయదు. ఈ మార్చిన పేరు గల వెబ్సైట్ ఇవాళ్టి నుంచే అమలులోకి రానుంది. తాజా వెబ్ సైట్ ద్వారా ఈ-హుండీ, ఈ-డొనేషన్స్ సౌకర్యం కూడా ఈ వెబ్ సైట్ ద్వారానే అందుబాటులో ఉండనుంది.