ఆమె ఓటమి స్వయంకృతాపరాధం.. ఆసక్తికరంగా టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి..
- IndiaGlitz, [Saturday,December 05 2020]
స్వయం కృతాపరాధం.. అనే మాటను తరచూ వింటూనే ఉంటాం. అలాంటి స్వయం కృతాపరాధమే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓ అభ్యర్థి కొంపముంచింది. కన్నకొడుకు కారణంగా ఓ తల్లి ఓటమి పాలైంది. ఊహించని ఈ పరిణామానికి తల్లీకొడుకులిద్దరూ తల పట్టుకోవాల్సి వచ్చింది. తాజాగా.. ఓ టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి చర్చనీయాంశంగా మారింది. ఆమె పోటీ చేసిన డివిజన్‌లో గెలిచిన వ్యక్తి గురించి ఎవరూ చెప్పుకోవడం లేదు. ఓడిపోయిన వ్యక్తి గురించి మాత్రం ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.
అసలు విషయంలోకి వెళితే.. హయత్‌నగర్ సర్కిల్ బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ముద్దగౌని లక్ష్మీప్రసన్నగౌడ్ బరిలోకి దిగారు. డమ్మీ అభ్యర్థిగా తన కుమారుడు రంజిత్‌గౌడ్‌నే లక్ష్మీ ప్రసన్నగౌడ్ రంగంలోకి దింపారు. మరి తన కుమారుడితో కావాలని నామినేషన్ విత్ డ్రా చేయించలేదో.. లేదంటే ఎవరో ఒకరం విజయం సాధిస్తాంలే అన్న ధీమాతో కుమారుడిని సైతం కొనసాగించారో తెలియదు కానీ కుమారుడికి వచ్చిన ఓట్లే లక్ష్మీ ప్రసన్నగౌడ్‌ను ఓటమి పాలు చేయడం ఆసక్తికరంగా మారింది.
శుక్రవారం జరిగిన కౌంటింగ్‌లో ఉదయం నుంచి బీజేపీ అభ్యర్థి మొద్దు లచ్చిరెడ్డిపై లక్ష్మీప్రసన్నగౌడ్ 1206 ఓట్ల లీడ్‌లో కొనసాగారు. అంతా హ్యాపీగా సాగుతున్న సమయంలో సాయంత్రం వరకు ఫలితాలన్నీ తారుమారయ్యాయి. లచ్చిరెడ్డి చేతిలో 32 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఓటమి పాలయ్యారు. డమ్మీ అభ్యర్థిగా బరిలోకి దిగిన లక్షీప్రసన్నగౌడ్ కుమారుడు రంజిత్‌గౌడ్ ఈ ఓటమికి కారణంగా నిలిచారు. స్వతంత్ర అభ్యర్థి రంజిత్‌గౌడ్‌కు 39 ఓట్లు పోలయ్యాయి. రంజిత్ బరిలో లేకుంటే ఆయనకు పోలైన ఓట్లు లక్ష్మీ ప్రసన్నకు పడి ఉండేవని.. ఆమె విజయం సాధించి ఉండేవారని విశ్లేషకులు భావిస్తున్నారు.