తెలంగాణ మంత్రివర్గ సమావేశం రద్దు.. ఎందుకంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. మంత్రివర్గ సమావేశానికి అనుమతి నిరాకరించింది. గత రెండు రోజుల క్రితం కేబినెట్ మీటింగ్ ఉంటుందంటూ ప్రభుత్వం ప్రకటించింది. శనివారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం అజెండాను కూడా సిద్ధం చేసింది. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో భేటీ నిర్వహణ కోసం ఈసీ అనుమతి కోరింది.
కానీ లోక్సభ ఎన్నికల కోడ్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో అనుమతి ఇవ్వలేదు. మంత్రివర్గ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ పేర్కొంది. ఈ నెల 27న ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు పోలింగ్ జరగనుంది. అలాగే జూన్ 4న లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం ఎన్నికల కోడ్ ముగియనుంది. అప్పటిదాకా మంత్రివర్గం సమావేశం నిర్వహించవొద్దని తేల్చిచెప్పింది.
కాగా ఈ మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ, ఏపీ మధ్య కొనసాగుతున్న విభజన అంశాలు, ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల కేటాయింపు తదితర అంశాలపై చర్చించాలని నిర్ణయించారు. జూన్ 2వ తేదీతో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కేవలం తెలంగాణ రాజధానిగా మారనుంది. దీంతో హైదరాబాద్లో ఏపీకి కేటాయించిన భవనాలను స్వాధీనం చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ అధికారులను ఆదేశించారు. షెడ్యూలు 9, షెడ్యూలు 10లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించిన పంపిణీపై చర్చించాలని భావించారు.
ఈ పదేళ్ల కాలానికి ఏపీకి కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ వంటి భవనాలను రాష్ట్ర అధీనంలోకి తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. పునర్విభజన చట్ట ప్రకారం పెండింగ్లో ఉన్న అంశాలు, ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయంతో పంపిణీ చేసుకున్న వివరాలపై సమగ్రమైన నివేదికను తయారు చేయాలని సూచించారు. వీటిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారు. వీటితో పాటు రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చించాలని సిద్ధమయ్యారు. అయితే ఈసీ అనుమతి నిరాకరించడంతో సమావేశం వాయిదాపడింది. ఎన్నికల ఫలితాల తర్వాత కేబినెట్ భేటీ నిర్వహించి ఈ అంశాలపై నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com