టీడీపీ ఘోర ఓటమికి అసలు కారణం తెలిసిందోచ్...!
- IndiaGlitz, [Friday,August 09 2019]
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కలలో కూడా ఊహించని రీతిలో కేవలం 23 స్థానాల్లో మాత్రమే గెలిచిన విషయం విదితమే. అయితే 151 స్థానాల్లో గెలిచి సత్తా చాటిన వైసీపీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే.. అసలు తాము ఎలా ఓడిపోయాం..? ఎక్కడ తప్పు జరిగింది..? ఓటమికి గల కారణాలేంటి..? అనే విషయాలకు ఎంత లోతుగా వెళ్లినప్పటికీ తెలుగు తమ్ముళ్లకు ముఖ్యంగా పార్టీ అధిపతి చంద్రబాబుకు సమాధానాలు మాత్రం దొరకలేదు. ఈ విషయాన్ని స్వయానా చంద్రబాబే మీడియా ముఖంగా పంచుకున్నారు కూడా. అయితే తాజాగా ఓటమికి అసలు కారణమేంటో తెలిసిపోయింది.
ఇదీ అసలు కారణం!
శుక్రవారం సాయంత్రం గుంటూరులోని పార్టీ కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎలా ఓడిపోయిందన్న అంశంపై నిశితంగా చర్చించారు. అనంతరం ఓటమికి గల కారణాలను పొలిట్ బ్యూర్ చంద్రబాబుకు వివరణ ఇచ్చుకుంది. ‘సామాజిక సమతుల్యం’ అనేది పాటించకపోవడం వల్లే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయామని టీడీపీ పొలిట్‌బ్యూరో తేల్చింది. మరీ ముఖ్యంగా పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా ఉన్న బీసీలు, మాదిగ సామాజిక వర్గ ఓట్లు చెదిరిపోవడం వల్లే ఇంత ఘోరంగా దెబ్బతిన్నామని సమావేశంలో పలువురు తెలుగు తమ్ముళ్ల అభిప్రాయం వ్యక్తం చేశారు.
సమావేశం బోరున ఏడ్చేసిన అయ్యన్న!
కాగా ఈ సమావేశంలో ఓటమికి గల కారణాలు చెబుతూ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కంటతడిపెట్టినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలపై జరిగిన విశ్లేషణలో తెలుగుదేశం హయాంలో చేపట్టిన పనులు, కష్టపడిన తీరును అయ్యన్నపాత్రుడు గుర్తుచేసి భావోద్వేగానికి లోనయ్యారు. అయితే ప్రజల కోసం ఇంత చేసినప్పటికీ.. వైసీపీకి ఓట్లేసి గెలిపించడం ఏంటి..? అని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ‘అన్న క్యాంటీన్’ల మూసివేసి వాటి స్థానంలో ‘రాజన్న క్యాంటిన్’లు ప్రారంభించడానికి వైసీపీ ప్రభుత్వం చేస్తున్నది. ఈ క్యాంటిన్ల మూసివేత గురించి మాట్లాడుతూ అయ్యన్న పాత్రుడు కంటతడి పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
సమావేశంలో ఏం చర్చించారు..!
మొత్తం 12 అంశాలపై ప్రధానంగా చర్చ
బీసీ, మాదిగ సామాజిక వర్గాలను తిరిగి పార్టీ దగ్గరయ్యేందుకు చేపట్టాల్సిన చర్యలు
ఏపీలో శాంతిభద్రతలు అదుపు తప్పడం
తెలుగుదేశం నేతలపై దాడులు, పార్టీ నేతలకు భద్రత తొలగింపు
రైతు ఆత్మహత్యలు
వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.5వేలు ఏమాత్రం సరిపోవు.. రూ.10వేల పరిహారంగా ఇవ్వాలి
గోదావరి నదీ జలాల వినియోగం.. తెలుగు ముఖ్యమంత్రుల మధ్య అంతర్గతంగా జరిగే అవగాహన ఒప్పందం
జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370, 35ఏ రద్దును స్వాగతించడం
పొలిట్‌బ్యూరో ప్రక్షాళన చేస్తే బాగుంటుందని సోమిరెడ్డి ప్రస్తావన.. ఇలా వీటితోపాటు పలు విషయాలపై చర్చించింది.
మొత్తానికి చూస్తే.. టీడీపీ ఘోర ఓటమికి గల కారణాలు కాసింత నిదానంగా అయినా తెలుగు తమ్ముళ్లు తెలిశాయన్న మాట. అయితే మున్ముందు జరగనున్న ఎన్నికలకు నేతలు ఎలా సమాయత్తమవుతారో..? వైసీపీ ఎత్తులకు పై ఎత్తులేసి ఏ మాత్రం సత్తా చాటుతారో తెలియాలంటే పంచాయితీ ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే మరి.