‘క్రాక్’ మల్టీప్లెక్స్ షో వాయిదా.. కారణమదే..!
- IndiaGlitz, [Saturday,January 09 2021]
మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన చిత్రం క్రాక్. శనివారం(జనవరి9న) విడుదల కావాల్సినఈ సినిమా మల్టీప్లెక్స్ షోస్ క్యాన్సిల్ అయ్యాయి. అందుకు కారణం.. ఆర్థిక సమస్యలు అని తేలింది. వివరాల్లోకి వెళితే క్రాక్ సినిమాకు ఠాగూర్ మధు నిర్మాత. ఆయన ఇంతకు ముందు విశాల్ హీరోగా తమిళంలో చేసిన టెంపర్ రీమేక్‌ను తెలుగులో మళ్లీ అయోగ్య పేరుతో విడుదల చేశాడు. ఆ సినిమా రీమేక్ రైట్స్ విషయంలో గొడవ జరిగి.. కోర్టు కేసు అయ్యింది. ఈ సమస్య తీరే వరకు ఠాగూర్ మధు నిర్మించిన క్రాక్ సినిమాను ఆపాలంటూ తమిళ అయోగ్య తమిళ నిర్మాతలు వేసిన కేసు కారణంగా మల్టీప్లెక్స్‌ల్లో క్రాక్ సినిమా షో వాయిదా పడింది. అయితే పదకొండు గంటల ఆట మాత్రం పడుతుంది. నిర్మాతకు ఇది ఓరకంగా ఇబ్బందికరమైన పరిస్థితే అయినా.. తప్పేలా లేదు. ఠాగూర్ మధు కొన్ని రోజుల నుండి ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఎట్టకేలకు ఈ సమస్యకు క్లియరెన్స్ దొరికినట్టయ్యింది.
డాన్‌శీను, బలుపు చిత్రాల తర్వాత రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ఇది. శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సముద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించారు.