హైదరాబాద్‌లో కిడ్నాప్.. అఖిలప్రియ అరెస్ట్.. అసలేం జరిగిందంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువుల కిడ్నాప్ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి, తెలుగుదేశం నాయకురాలు అఖిల ప్రియను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కిడ్నాప్ కేసును కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించడం విశేషం. కేసులో ప్రధాన నిందితులు.. ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ, కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి(భూమా నాగిరెడ్డి సన్నిహితుడు)ని పోలీసులు అరెస్టు చేశారు. ఐదు వందల కోట్ల రూపాయల విలువైన భూ వివాదం కారణంగా ఈ కిడ్నాప్ జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించి హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బంధువులైన ప్రవీణ్‌రావు, సునీల్‌రావు, నవీన్‌రావు అనే ముగ్గురు సోదరులు బోయిన్‌పల్లిలో నివాసముంటున్నారు.
వీరి నివాసంలోకి మంగళవారం రాత్రి 7.20 గంటలకు.. 10 నుంచి 15 మంది ప్రవేశించారు. తమను తాము ఆదాయపన్ను అధికారులుగా పరిచయం చేసుకుని ఐడీ కార్డులు సైతం చూపించారు. ప్రవీణ్‌రావు, సునీల్‌రావు, నవీన్‌రావులను కిడ్నాప్ చేశారన్న విషయాన్ని గుర్తించిన సునీల్ భార్య సరిత.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పాత భూ వివాదాల నేపథ్యంలో ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్‌ల అనుచరులే కిడ్నాప్ చేసి ఉంటారని ఆమె అనుమానించారు. వెంటనే స్పందించిన బోయిన్పల్లి పోలీసులు.. కిడ్నాప్ అయిన వారిని కాపాడేందుకు అప్పటికప్పుడు 15 బృందాలను ఏర్పాటు చేశారు. మరోవైపు కమిషన్ అర్థరాత్రే.. ఆంధ్రప్రదేశ్ డీజీపీ, కర్నూలు ఎస్పీలతో మాట్లాడారు. బాధితుల ఫోన్ నంబర్లు, సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా వ్యూహాత్మకంగా వ్యవహరించి.. అర్ధరాత్రి 3.30 సమయంలో బాధితులను గుర్తించారు. నిందితులు మాత్రం తప్పించుకునట్లు సీపీ వెల్లడించారు.
లోధా అపార్ట్మెంటులో అఖిల ప్రియ అరెస్ట్..
పోలీసులకు లభించిన ప్రాథమిక ఆధారాల మేరకు ఈ కేసులో అఖిలప్రియ ప్రమేయం ఉన్నట్టు గుర్తించారు. వెంటనే కూకట్పల్లి, లోధా అపార్టుమెంట్లో నివాసముంటున్న అఖిలప్రియ (32)ను పోలీసులు అరెస్టు చేశారు. అఖిలప్రియ విచారించిన అనంతరం.. వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అఖిల ప్రియ గర్భవతిగా ఉండటంతో లేబర్ వార్డులో బీపీ, ఇతర వైద్య పరీక్షలు జరిపి, భారీ పోలీస్ బందోబస్తు మధ్య సికింద్రాబాద్ కోర్టు న్యాయమూర్తి ఇంటికి తీసుకెళ్ళారు. ఆమెను 14 రోజుల పాటు రిమాండ్‌కు తరలిస్తున్నట్లు న్యాయమూర్తి ఆదేశించారు. అనంతరం ఆమెను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. ఈ కేసులో ఏ-1గా ఏవీ సుబ్బారెడ్డిని, ఏ-2గా భూమా అఖిలప్రియను, ఆ తర్వాత ఆమె భర్త భార్గవరామ్‌ను, శ్రీనివాస్ చౌదరి అలియాస్ గుంటూరు శ్రీను, సాయి, చంటి, ప్రకాశ్‌లను నిందితులుగా చేర్చారు.
హఫీజ్‌పేట భూవివాదమే కారణం..
హఫీజ్‌పేటలో ఉన్న 25 ఎకరాల భూ వివాదమే ఈ కిడ్నాప్ వ్యవహారానికి కారణమని విచారణలో వెల్లడైనట్లు సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. 2016లో ప్రవీణ్ రావు ఈ స్థలాన్ని కొనుగోలు చేశారు. అప్పట్లోనే ఈ స్థలానికి సంబంధించి ఏవీ సుబ్బారెడ్డికి, ప్రవీణ్‌కు మధ్య వివాదం తలెత్తింది. అయితే... భూమా నాగిరెడ్డి ప్రమేయంతో అది సద్దుమణిగింది. భూమా నాగిరెడ్డి మృతి తర్వాత ఆమె కుమార్తె అఖిలప్రియ ఆ స్థలంలో తమ వాటాకు సంబంధించి ప్రవీణ్‌ను సంప్రదించింది. అంతటితో ఆగక ఆమె బెదిరింపులకు పాల్పడినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. గత ఏడాది సెప్టెంబర్ 21న ఏవీ సుబ్బారెడ్డి, అతని అనుచరులు కలిసి స్థలంలో అక్రమంగా ప్రవేశించారని అప్పట్లో వాచ్‌మన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. కాగా.. 2016 నుంచి స్థలం విషయంలో తమ మధ్య గొడవలు ఉండటంతో ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియ కుటుంబీకులే కిడ్నాప్ చేసి ఉంటారని ప్రవీణ్‌రావు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులకు నిందితుల గుర్తింపు సునాయాసమై పోయింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments