బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి చేయడానికి కారణం ఇదే...
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి నటసింహం బాలకృష్ణ తన వందో చిత్రాన్ని ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ...ఈ చిత్రం కోసం మీరు ఎంతగా ఎదురుచూస్తున్నారో...నేను కూడా అంతే ఆసక్తితో ఎదురుచూసాను. ఇంత సమయం తీసుకోవడానికి కారణం చెప్పాలి. వందో సినిమా అంటే చెప్పుకోవడానికి ఒక సినిమానే కావచ్చు. కానీ..తొంభై తొమ్మిది సినిమాల కష్టం నుంచి పుట్టికొచ్చిన ఫలితం. తొంభై తొమ్మిది మైలురాళ్లు దాటిన నా నలభై ఏళ్ల ప్రయాణం. ఇన్నేళ్లు నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకదేవుళ్లకు నేను చేయాల్సిన చిత్రోత్సవం. ఈ సినిమా నా చరిత్రలోనే కాదు తెలుగు సినిమా చరిత్రలో కూడా నిలిచిపోవాలి. అందుకే ఎన్నో కథలు విన్నాను. కొన్ని నచ్చలేదు. కొన్నికథలు నచ్చినా వాటికి వందో సినిమా స్ధాయి ఉందనిపించలేదు. ఎక్కడో ఏదో అసంతృప్తి. ఇంకా ఏదో కావాలి. ఆ ఏదో అనేదాన్ని వెతుకుతూ కొన్ని ఎంచుకున్నాను. ఆ క్రమంలోనే క్రిష్ కథ విన్నాను. గౌతమిపుత్ర శాతకర్ణి కథ వినగానే...ఇంతకాలం నేను ఆగింది దీని కోసమే కదా అనిపించింది.
ఎందుకంటే ఇది ఓ తెలుగు వీరుడికథ. మన చరిత్ర. చాలా మందికి తెలియని మన ఘన చరిత్ర. దేశ చరిత్రలో చాలా మంది చక్రవర్తులు ఉన్నారు. కానీ..భరతఖండం మొత్తాన్నీ ఏకఛత్రాధిపత్యంగా పాలించిన సార్వభౌముడు ఒక్కడే ఉన్నాడు. పురాణాల్లో చాలా మంది ఉన్నారు. కానీ..చరిత్రలో ఒక్కడే గౌతమిపుత్ర శాతకర్ణి. మన తెలుగువాడు. ఇదే అమరావతి రాజధానిగా అఖండ భారతాన్ని పరిపాలించాడు. శాంతి కోసం యుద్ధం చేసిన మహావీరుడాయన. ఓటమి అనేది ఎలా ఉంటుందో అనేది ఆయనకు తెలియదు. ఒక్కమాటలో చెప్పాలంటే..గెలుపు అనేది ఎవరికైనా ఒక లక్ష్యం. ఆయనకు లక్షణం. అందుకే ఈ పాత్ర పోషించాలనిపించింది. ఏ భాషకి లేని చరిత్ర మన భాషకి ఉంది.అది చాటి చెప్పే అవకాశం మాకు వచ్చింది. ఇంత వరకు ఈ కథను ఎందుకు సినిమాగా తీయలేదో నాకు అర్ధం కాలేదు. లండన్ లో ప్రత్యేకంగా అమరావతి మ్యూజియం ఉంది. అక్కడ శాతకర్ణికి సంబంధించిన జ్ఞాపకాలు ఉన్నాయి. వాళ్లకు స్పూర్తి శాతకర్ణి అంటే అర్ధం చేసుకోండి.
ఈ సందర్భంలో మా నాన్నగారే ఉంటే నన్ను వారి గుండెకు హత్తుకునేవారు. వారు మన తెలుగు సార్వభౌముల్లో దాదాపు అందరి పాత్రల్లో జీవించారు. శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు, బ్రహ్మనాయుడు, బొబ్బిలి రంగా నాయుడు, ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు. కానీ వీరందరి కన్నా.. గొప్ప చరిత్ర ఉన్న పాత్ర, ఆయన చేయని పాత్ర, నా వందో చిత్రం ఇదే కావాలని నాన్నగారే నన్ను ఆశీర్వదించి, ఈ కథ చెప్పమని క్రిష్ ని నా దగ్గరికి పంపించారేమో అనిపించింది. ఈ చిత్రం మన తెలుగుతల్లికి మేము సమర్పిస్తున్న మల్లెపూల దండ.
తెలుగు భాష..భరతమాత వెన్నుపూస. ఈ మాట నేను ఎందుకు అన్నానో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. నాగరికత తలకట్టు నా తెలుగు భాష. జాతి మెలితిప్పిన మీసకట్టు నా మాతృభాష. ప్రపంచపటం కట్టిన పంచెకట్టు నా తెలుగు భాష...ఇలా నేను ఎందుకు అంటున్నానో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. అందుకే గౌతమిపుత్ర శాతకర్ణి గా మీ ముందుకు వస్తున్నాను అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout