ఏపీ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం వెనుక కారణమిదేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీ ప్రభుత్వం మంగళవారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. అమరావతిలో అసంపూర్తిగా మిగిలిపోయిన భవనాల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు రూ.3000 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. నిన్న మొన్నటి వరకూ ‘శ్మశానం’, ‘ఎడారి’తో పోల్చారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా వదిలేసిన భవనాల నిర్మాణానికి సైతం ఆసక్తికనబరచలేదు. ఎక్కడి భవనాలను అక్కడే అసంపూర్ణంగానే వదిలేసింది. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులను అసెంబ్లీలో ఆమోదించుకున్నారు. వీటిపై గవర్నర్ ఆమోదముద్ర కూడా వేశారు.
మరోవైపు పరిపాలనా రాజధానిని విశాఖపట్నానికి తరలించేందుకు పెద్దఎత్తున ప్రయత్నాలను సైతం వైసీపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఈ సమయంలో అనూహ్య నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంత సడెన్గా ప్రభుత్వానికి అమరావతిపై ప్రేమెందుకు పుట్టుకొచ్చిందనే చర్చ ఏపీ వ్యాప్తంగా జరుగుతోంది. దీనిపై కొందరు హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. ఏడాదికి పైగా అమరావతి రాజధానిగా ఉంచాలంటూ రైతులు దీక్ష చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం సడెన్గా యూటర్న్ తీసుకోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే వాదన బలంగానే వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లలో వైసీపీకి ఎదురుదెబ్బ తగలకుండా.. రైతులను ఎలాగోలా బుజ్జగించడానికి పన్నిన రాజకీయ ఎత్తుగడేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు ఆపడం లేదని చెప్పడంతో పాటు.. తద్వారా హైకోర్టు నిర్ణయాలు ప్రతికూలంగా రాకుండా చూసుకునేందుకు దీర్ఘకాలిక వ్యూహం వైసీపీ ప్రభుత్వం అమలు చేయబోతోందంటూ విమర్శలు వినబడుతున్నాయి. మోటివ్ ఏదైనా అమరావతికి మేలు జరిగితే చాలని సామాన్య ప్రజానీకం భావిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments