47 నిమిషాలు గూగుల్ సేవలు నిలిచిపోవడానికి కారణం ఇదే..

  • IndiaGlitz, [Sunday,December 20 2020]

గత సోమవారం గూగుల్ సేవలు ఒక్కసారిగా నిలిచిపోవడంలో ప్రపంచం మొత్తం షాక్ అయిన విషయం తెలిసిందే. 47 నిమిషాల పాటు గూగుల్ సేవలైన జీమెయిల్, యూట్యూబ్ వంటివన్నీ ఆగిపోయాయి. ఇదో పెద్ద సెన్సేషనల్ న్యూస్‌గా మారిపోయింది. ఎవరో హ్యాక్ చేశారని కొందరు.. ఇలా రకరకాల ఊహాగానాలు ప్రచారం జరిగాయి. ఇక మీమ్స్, సెటైర్లకైతే సోషల్ మీడియాలో కొదువ లేకుండా పోయాయి. అయితే నిజానికి ఆ 47 నిమిషాలు ఏం జరిగిందనే విషయం మాత్రం ఎవరికీ తెలియరాలేదు.

తాజాగా ఆ మిస్టరీ బయటకు వచ్చింది. వినియోగదారులను ధృవీకరించేందుకు లేదంటే ట్రాక్ చేసేందుకు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఇంక్ వద్ద చాలా టూల్స్ ఉంటాయి. అయితే ఈ ఏడాది అక్టోబర్‌లో ఈ టూల్స్‌ను కొత్త ఫైల్ స్టోరేజీ సిస్టంలోకి మార్చడం మొదలు పెట్టింది. ఈ ప్రక్రియలోనే తప్పు జరిగింది. డేటా భాగాలను తప్పుగా నివేదించడంతో గూగుల్ అందిస్తున్న పలు సర్వీసులకు 47 నిమిషాల పాటు అంతరాయం ఏర్పడింది. అయితే ఇలా జరగడం చాలా అరుదని టెక్నాలజీ నిపుణులు తెలిపారు. సోమవారం సేవల్లో జరిగిన అంతరాయం కారణంగా గూగుల్ క్లౌడ్ స్టోరేజ్‌కు పంపిన దాదాపు 15 శాతం అభ్యర్థనలు దెబ్బతిన్నట్టు కంపెనీ తెలిపింది. కాగా.. జీమెయిల్ సేవల్లో మంగళవారం మళ్లీ సమస్య తలెత్తింది. డేటా మైగ్రేషన్‌లో సమస్య వల్లే ఇలా జరిగిందని గూగుల్ పేర్కొంది.