Real Star Srihari : సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా రియల్ స్టార్ శ్రీహరి తమ్ముడు.. కేంద్రం ఉత్తర్వులు
Send us your feedback to audioarticles@vaarta.com
దివంగత సినీనటుడు, రియల్ స్టార్ డాక్టర్ శ్రీహరి సోదరుడు ఆర్ శ్రీధర్‌కు కీలక పదవి లభించింది. ప్రాంతీయ సెన్సార్ బోర్డ్ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) హైదరాబాద్ రీజియన్ సభ్యుడిగా శ్రీధర్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఈ సందర్భంగా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ. తనకు లభించిన ఈ పదవికి పూర్తి న్యాయం చేస్తానన్నారు. కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి, కేంద్ర సెన్సార్ బోర్డ్ ఛైర్‌పర్సన్, తెలంగాణ బీజేప అధ్యక్షుడు బండి సంజయ్‌కు శ్రీధర్ కృతజ్ఞతలు తెలియజేశారు. సెన్సార్ బోర్డు సభ్యుడిగా నియమితులైన శ్రీధర్‌కు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఇకపోతే.. శ్రీధర్ వంద సినిమాల్లో నటించడంతో పాటు పలు చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు.
రియల్ స్టార్ … అంటే అతనే:
ఇక.. రియల్ స్టార్ శ్రీహరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణ మెకానిక్ నుంచి టాలీవుడ్‌లోని పెద్ద నటుల్లో ఒకరిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. విలన్‌గా, హీరోగా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, మానవతావాదిగా ఆయన తెలుగు వారి గుండెల్లో నిలిచిపోతారు. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన బ్రహ్మనాయుడు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన శ్రీహరి అంచెలంచెలుగా ఎదిగారు. డిస్కో శాంతిని పెళ్లాడిన శ్రీహరికి ముగ్గురు పిల్లలు. వీరిలో కుమార్తె అక్షర మరణంతో ఆయన బాగా కృంగిపోయారు. ఈ క్రమంలోనే కూతురి జ్ఞాపకార్ధం అక్షర ఫౌండేషన్‌ను స్థాపించి ఎంతో మందికి సాయం చేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణలతో పాటు మూడు తరాల నటులతో శ్రీహరి పనిచేశారు. షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లి అక్కడ తీవ్ర అస్వస్థతకు గురైన శ్రీహరి అక్కడే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 2013 అక్టోబర్ 9న కన్నుమూశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments