జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి సిద్ధం: పవన్
- IndiaGlitz, [Wednesday,November 18 2020]
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక ప్రకటనను విడుదల చేశారు. యువ కార్యకర్తల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ ఆ ప్రకటనలో తెలియజేశారు. ఎన్నికల్లో పోటీకి సన్నద్ధం కావాలని పార్టీ నాయకులకు, నగర పరిధిలోని కమిటీలకు స్పష్టం చేశారు. జనసేన కమిటీలు కేత్రస్థాయిలో పనిచేస్తూ ఇప్పటికే ప్రజల పక్షాన నిలబడ్డాయని పవన్ తెలిపారు.
‘‘గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో పోటీ చేయాలని యువ కార్యకర్తల విజ్ఞప్తి మేరకు నిర్ణయించాం. తెలంగాణ రాష్ట్రంలోనూ, జీహెచ్ఎంసీ పరిధిలోనూ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న కార్యకర్తలు, యువ జనసైనికుల నుంచి ఈ అంశంపై పలు ప్రశంసలు, విజ్ఞప్తులు వచ్చాయి. వారి వినతి మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి సన్నద్ధం కావాలని పార్టీ నాయకులను, వారి పరిధిలోని కమిటీలకు స్పష్టం చేశాను.
నా వద్దకు వచ్చిన కార్యకర్తలు, కమిటీల ప్రతినిధులు ఇప్పటికే పలు దఫాలు సమావేశమై చర్చించుకున్నారు. జీహెచ్ఎంసీలోని పలు డివిజన్లలో ఉన్న జనసేన కమిటీలు క్షేత్ర స్థాయిలో పని చేస్తూ.. ఇప్పటికే ప్రజల పక్షాన నిలిచాయి. తమ కార్యకలాపాలపై సమగ్రంగా సమీక్షించుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని క్షేత్ర స్థాయిలోని కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారు. వారి అభీష్టానికి అనుగుణంగా జనసేన పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలుపుతుంది’’ అని పవన్ కల్యాణ్ వెల్లడించారు.