ఏపీలో ఐదు చోట్ల మళ్లీ పోలింగ్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు పోలింగ్ బూతుల్లో మరోసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. బుధవారం సాయంత్రం ఈ విషయమై సీఈసీ ఏపీ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఈ లేఖపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 19న ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఆయా బూత్‌ల పరిధిలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరపాలని అధికారులను ఆదేశించింది. కాగా.. ఏప్రిల్-11న ఎన్నికలు జరిగిన అనంతరం రెండోసారి కొన్ని ప్రాంతాల్లో రీపోలింగ్ జరిగిన విషయం విదితమే.
రీ- పోలింగ్ జరిగేది ఎక్కడ!?
321-ఎన్‌ఆర్ కమ్మపల్లి, 104- పులివర్తి వారి పల్లి, 316- కొత్త ఖండ్రిగ, 318-కమ్మపల్లి, 313-వెంకట రామాపురం పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరగనుంది. కాగా ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఈ రీపోలింగ్ జరగనున్న ప్రాంతాలల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసే యోచనలో ఈసీ ఉన్నట్లు తెలుస్తోంది.
రీ- పోలింగ్ ఎందుకు జరుగుతోంది..?
చంద్రగిరి నియోజకవర్గంలోని కొన్ని బూతుల్లో రీపోలింగ్ జరపాలని ఈ నెల 10, 11న ఇటు వైసీపీ.. అటు టీడీపీ అభ్యర్థులు, పార్టీ నేతల నుంచి రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. మరీ ముఖ్యంగా.. చంద్రగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఇటీవల కలిసి మా నియోజకవర్గంలో దళితులను ఓటు వేయకుండా చేశారంటూ ఫిర్యాదులు చేశారు.ఈ విషయంపై జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారాలతో మాట్లాడిన రాష్ట్ర ఎన్నికల సంఘం అసలేం జరిగింది...? రీపోలింగ్ ఎందుకు నిర్వహించాలి..? ఫిర్యాదుల్లో ఏయే అంశాలు ప్రస్తావనకు తెచ్చారు..? ఇలాంటివన్నీ పరిగణనలోనికి తీసుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈసీ నివేదించింది. దీంతో చంద్రగిరి నియోజకవర్గంలోని ఎన్.ఆర్ కమ్మపల్లె, కమ్మపల్లె, పులివర్తిపల్లె, కొత్తకండ్రిగ, వెంకట్రామపురంలో రీపోలింగ్‌కు ఆదేశించింది.
ఎవరెవరు పోటీ చేస్తున్నారు.. చంద్రగిరి చరిత్రేంటి?
కాగా ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున.. సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. టీడీపీ తరఫున పులివర్తి నాని పోటీ చేస్తున్నారు. 9 సార్లు జరిగిన ఎన్నికల్లో ఇప్పటి వరకూ కేవలం రెండు సార్లు మాత్రమే టీడీపీ గెలిచింది. మిగిలిన ఏడు సార్లలో ఆరు సార్లు కాంగ్రెస్.. 2014లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలిచారు. కాగా 1978లో మొట్ట మొదటిసారి ఇక్కడ్నుంచి నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తరఫున పోటీచేసి గెలుపొందారు.
ఆ తర్వాత టీడీపీ నుంచి అయ్యదేవ నాయుడు.. అనంతరం నారావారి కుటుంబం నుంచి 1994లో నారా రామ్మూర్తి నాయుడు టీడీపీ నుంచి గెలిచి నిలిచారు. అయితే ఈ 2019 సార్వత్రిక ఎన్నికల్లో చెవిరెడ్డి గెలిచి కంచుకోటగా మలుచుకుంటారో..? లేక పులివర్తి నాని గెలిచి ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ గడప తొక్కుతారో వేచి చూడాల్సిందే మరి. సో.. ఇక్కడ గెలుపెవరిదో.. ఏపీ సీఎం ఎవరు కాబోతున్నారో తెలియాలంటే మే-23 వరకు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout