Shaktikanta Das:రూ.1000 నోటును తిరిగి ప్రవేశపెట్టేది లేదు.. రూ.2 వేల నోటు డిపాజిట్లపై నిబంధనలివే : ఆర్బీఐ గవర్నర్
Send us your feedback to audioarticles@vaarta.com
రూ.2000 నోటును ఉపసంహరించుకుంటూ రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిని అధికార బీజేపీ నేతలు సమర్ధిస్తూ వుండగా.. ప్రతిపక్షాలు మాత్రం తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం మరోసారి సామాన్యులను ఇబ్బంది పెడుతోందని.. 2016 నాటి దెయ్యం మరోసారి తిరిగొచ్చిందని సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు 2000 నోటును మార్చుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ సెప్టెంబర్ 30 వరకు గడువు విధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు బ్యాంక్‌లకు క్యూకడుతున్నారు.
4 నెలల సమయం వుంది.. మార్పిడికి హడావుడి వద్దు:
ఇదిలావుండగా.. రూ.2000 నోటు ఉపసంహరణపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు. సోమవారం మీడియా ముందుకు వచ్చిన ఆయన నగదు నిర్వహణలో భాగంగానే రూ.2000 నోటును ఉపసంహరించుకున్నట్టు తెలిపారు. 2016లో నోట్ల రద్దు తర్వాత ఆర్ధిక వ్యవస్ధలోకి వేగంగా నగదును చొప్పించడంలో భాగంగానే రూ.2000 నోటును తీసుకొచ్చినట్లు శక్తికాంత దాస్ చెప్పారు. నోట్ల మార్పిడికి సంబంధించి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు తీసుకున్నామని గవర్నర్ తెలిపారు. నాలుగు నెలల సమయం వున్నందున ప్రజలు.. హడావుడి పడకుండా నోట్లు మార్చుకోవచ్చని శక్తికాంత దాస్ చెప్పారు. ఉపసంహరణకు ముందే కొంతమంది వ్యాపారులు రూ.2000 నోటును తిరస్కరించారని, ఉపసంహరణ ప్రక్రియ తర్వాత అది ఇంకా ఎక్కువైందన్నారు. 2000 నోట్ల స్థానంలో ఇతర నోట్లను తీసుకొచ్చేందుకు నగదును అందుబాటులో వుంచామని శక్తికాంత దాస్ తెలిపారు. రూ.1000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టినట్లుగా వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు.
డిపాజిట్ రూ.50 వేలు దాటితే పాన్ తప్పనిసరి :
మరోవైపు.. బ్యాంకుల్లో గుర్తింపు కార్డులు లేకుండా డిపాజిట్లను ఎలా అనుమతిస్తారన్న విలేకరుల ప్రశ్నకు శక్తికాంత దాస్ సమాధానమిచ్చారు. రూ.50000 కంటే ఎక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లకు పాన్ సమర్పించాలనే నిబంధన వుందని ఆయన గుర్తుచేశారు. ఇదే నిబంధన రూ.2000 నోట్లకూ వర్తిస్తుందన్నారు. పెద్ద మొత్తంలో బ్యాంక్‌లకు వచ్చే డిపాజిట్లను తనిఖీ చేసే అంశం ఆదాయపు పన్ను శాఖ పరిధిలోనిదని శక్తికాంత దాస్ పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout