మరో 3 నెలలు ఈఎంఐ లోన్లు కట్టక్కర్లేదు.. ఆర్బీఐ కీలక ప్రకటన
- IndiaGlitz, [Friday,May 22 2020]
కరోనా కష్టకాలంలో ఆర్బీఐ మరో కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే మారటోరియం ప్రకటించిన ఆర్బీఐ తాజాగా మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం నాడు మీడియా మీట్ నిర్వహించిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఈ కీలక ప్రకటన చేశారు. రుణాలపై మారటోరియం మరో మూడు నెలలు అనగా.. జూన్-01 నుంచి ఆగస్టు-31 వరకు మారటోరియం పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ స్పష్టం చేశారు. ఈ మారటోరియం అనేది అన్ని రకాల టర్మ్ లోన్స్‌కు వర్తిస్తుందని కూడా ఆయన తెలిపారు. కాగా ఇప్పటికే మార్చి-01 నుంచి మే-31 వరకు మారటోరియం వర్తించిన విషయం తెలిసిందే. ఈ నెల చివరితో ఇదివరకటి మారటోరియం పూర్తికానుండటంతో మరోసారి పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.
మొత్తం ఆరు నెలలు..
మొత్తానికి చూస్తే.. లోన్ తీసుకున్న వారికి అదిరిపోయే శుభవార్త అని చెప్పుకోవచ్చు. బ్యాంకుల్లో రుణం తీసుకున్న వారికి ఇది భారీ ఊరటే. ఈ మారిటోరియం అనేది హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్‌తో పాటు పలు రకాల టర్మ్ లోన్స్ తీసుకున్న వారికి వర్తిస్తుంది. మరీ ముఖ్యంగా క్రెడిట్ కార్డు బకాయిలకు కూడా మారటోరియం వర్తిస్తుంది. అంటే.. ఇప్పటికే మూడు నెలలు.. మరో మూడు నెలలు అనగా మొత్తం 6 నెలల్లో మీ ఈఎంఐలు చెల్లించకపోతే మీరు తీసుకున్న రుణం డిఫాల్ట్ లేదా ఎన్పీఏ కేటగిరీలో పరిగణించబడదు. కరోనా సంక్షోభం, లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్బీఐ ఇలాంటి ఉపశమనాలను ప్రకటించింది.