రావణాసుర కోసం సుధీర్ వర్మ డేర్ స్టెప్... రవితేజ కూడా సై

  • IndiaGlitz, [Friday,January 21 2022]

మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలతో హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన చేతిలో నాలుగైదు సినిమాలు వున్నాయి. ఈ క్రమంలో భోగి సందర్భంగా రవితేజ మరో కొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్ వర్క్స్ సంస్థలపై రూపొందుతున్న సినిమా 'రావణాసుర' . సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. అభిషేక్ నామా నిర్మాత. రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా, సత్య, జయప్రకాష్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు.

భోగిని పురస్కరించుకుని రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. హర్ష వర్దన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి సినిమాకు సంగీతం అందించనున్నారు. రవితేజ 'బెంగాల్ టైగర్'కు భీమ్స్ సంగీతం అందించారు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న 'డబుల్ ధమాకా'కు కూడా ఆయనే సంగీత దర్శకుడు. అనూ ఇమ్మానుయేల్, మేఘా ఆకాష్, 'జాతి రత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా, 'బంగార్రాజు'లో ఓ పాటలో మెరిసిన దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ - మొత్తం ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు.

ఈ ఏడాది సెప్టెంబర్ 30న రావణాసురను విడుదల చేయనున్నట్టు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాలో రవితేజ న్యాయవాది పాత్రలో కనిపించనున్నారు. ఇందులో రాముడిగా కీలక పాత్రలో సుశాంత్ నటించనున్నారు. ఈ సినిమా కోసం రవితేజ అండ్ టీమ్ డేరింగ్ స్టెప్ వేస్తున్నారు. అదేంటంటే.. కరోనా టైమ్‌లోనూ అవుట్ డోర్ షూటింగ్.

'రావణాసుర' సినిమా టాకీ పార్ట్ మొత్తాన్ని హైద‌రాబాద్‌లోని రియల్, నేచురల్ లొకేష‌న్స్‌లో షూటింగ్ చేయాల‌ని డిసైడ్ అయ్యిందట చిత్రయూనిట్. అంతేకాదు సినిమా కోసం ఒక్క సెట్ కూడా వేయడం లేదట. నేచుర‌ల్ లొకేష‌న్స్‌లో తెరకెక్కించేలా దర్శకుడు సుధీర్ వర్మ ప్లాన్‌కు ర‌వితేజ ఓకే చెప్పారని సమాచారం.