'రావణాసుర' సెట్‌లో అడుగు పెట్టిన రవితేజ

  • IndiaGlitz, [Wednesday,February 02 2022]

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్‌లో రాబోతోన్న 'రావణాసుర' సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఫ‌స్ట్ షెడ్యూల్‌లో సుశాంత్, ఇతర తారాగణం మీద కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించారు. నేడు ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ప్రారంభ‌మైంది. ఈ షెడ్యూల్‌లో మాస్ మహారాజ ర‌వితేజ‌ పాల్గొన్నారు.

ఫస్ట్ డే.. రావణాసుర.. ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది.. అంటూ రవితేజ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో పాటు యూనిట్‌తో దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు. ఇందులో దర్శకుడు సుధీర్ వర్మ, ఫరియా అబ్దుల్లా, నిర్మాత అభిషేక్ నామా, రైటర్ శ్రీకాంత్ విస్సా, సినిమాటోగ్రఫర్ విజయ్ కార్తీక్ కన్నన్ ఉన్నారు.

అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్లపై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. రవితేజ ఈ చిత్రంలో న్యాయవాదిగా కనిపించబోతోన్నారు. రామ్ పాత్రలో సుశాంత్ ముఖ్యమైన రోల్‌లో నటిస్తున్నారు.

ఈ చిత్రంలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు ఉండబోతోన్నారు. అను ఇమాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడలు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ ఐదుగురిలో ప్రతీ ఒక్క పాత్రకు ప్రాముఖ్యత ఉండ‌నుంది.

రచయితగా శ్రీకాంత్ విస్సా ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. ఆయనే ఈ సినిమాకు కథను అందించారు. సుధీర్ వర్మ తన సినిమాలను ఎంత కొత్తగా, స్టైలీష్‌గా తెరకెక్కిస్తారో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో రవితేజను ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా చూపించబోతోన్నారు. పోస్టర్‌ను బట్టే మనకు ఆ విషయం అర్థమవుతోంది.

ఇక ఈ చిత్రానికి ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పని చేయబోతోన్నారు. హర్ష వర్దన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫర్‌గా, శ్రీకాంత్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.