ఆ సంఘ‌ట‌నే...క్ష‌ణం క‌థ‌కి స్పూర్తి - డైరెక్ట‌ర్ ర‌వికాంత్

  • IndiaGlitz, [Thursday,February 25 2016]

నాగార్జున‌తో ఊపిరి, మ‌హేష్ తో బ్ర‌హ్మోత్స‌వం...ఇలా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్న‌ ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి బ్యానర్. కోటి రూపాయ‌ల బ‌డ్జెట్ తో పి.వి.పి సంస్థ నిర్మించిన సస్పెన్స్ థ్రిల్ల‌ర్ క్షణం. అడవిశేష్,ఆదాశర్మ, అనసూయ భరద్వాజ. జ్యోతిలక్ష్మి ఫేమ్ సత్యదేవ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన క్ష‌ణం చిత్రాన్నినూత‌న ద‌ర్శ‌కుడు ర‌వికాంత్ తెర‌కెక్కించారు. ఈనెల 26న క్ష‌ణం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఈ సంద‌ర్భంగా క్ష‌ణం డైరెక్ట‌ర్ ర‌వికాంత్ తో ఇంట‌ర్ వ్యూ మీకోసం...

మీ గురించి చెప్పండి..?

నేను వైజాగ్ లో పుట్టి పెరిగాను. కెమిక‌ల్ ఇంజ‌నీరింగ్ చ‌దివాను. చిన్న‌ప్ప‌టి నుంచి సినిమాలు అంటే బాగా ఇష్టం. ఇంజ‌నీరింగ్ చేస్తున్ప‌ప్ప‌డే అడ‌వి శేషు తో ప‌రిచ‌యం ఉంది. ఇంజ‌నీరింగ్ పూర్తి చేసిన త‌ర్వాత హైద‌రాబాద్ వ‌చ్చి అడ‌వి శేషు ద‌గ్గ‌ర కిస్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా వ‌ర్క్ చేసాను. క్ష‌ణం సినిమాతో డైరెక్ట‌ర్ గా ప‌రిచ‌యం అవుతున్నాను.

క్ష‌ణం ప్రాజెక్ట్ ఎలా సెట్ అయ్యింది..?

క్ష‌ణం క‌థ‌ను నేను, శేషు క‌ల‌సి రాసాం. మేమే ఈ సినిమాని నిర్మించాల‌నుకున్నాం. అయితే ఒక‌రోజు శేషు పి.వి.పి గార్ని క‌ల‌సి డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో స్టోరీ రాసాం. వింటారా అని అడిగితే ఓకె అని చెప్పి టైమ్ ఇచ్చారు. స్ర్కిప్ట్ న‌చ్చి వెంట‌నే మూడు రోజుల్లో ఈ సినిమా కోసం ఆఫీస్ ఇచ్చారు. నాకు ఈ సినిమాకి డైరెక్ట‌ర్ గా అవ‌కాశం వ‌చ్చిందంటే నా వ‌ల్లో...శేషు వ‌ల్లో కాదు. స్ర్కిప్ట్ వ‌ల్లే ఈ అవ‌కాశం వ‌చ్చింద‌నే నా న‌మ్మ‌కం

ఇంత‌కీ క్ష‌ణం క‌థ‌లో ఏముంది..?

ఇది ఒక స‌స్పెన్స్ డ్రామా. ఒక చిన్న పిల్ల కాడ్నాప్ అవ్వ‌డం అనే పాయింట్ చుట్టూ తిరిగే క‌థ ఇది. సినిమా చూస్తున్నంత సేపు నెక్ట్స్ ఏం జ‌రుగుతుందో అని ఇంట్ర‌స్టింగ్ గా చూసేలా ఉంటుంది.

ద‌ర్శ‌కుడిగా తొలి సినిమా అన‌గానే ల‌వ్ స్టోరీ తోనో...ఎంట‌ర్ టైన్మెంట్ తో ఉండే సినిమానో చేస్తారు క‌దా..మీరు ఈ స‌స్పెన్స్ డ్రామా ఎంచుకోవ‌డానికి కార‌ణం ఏమిటి..?

పి.వి.పి బ్యాన‌ర్ లో ఫ‌స్ట్ మూవీ చేస్తున్నామంటేనే అది నాకు ఎఛీవ్ మెంట్ లాంటిది. ల‌వ్ స్టోరీస్ తో చాలా సినిమాలు వ‌స్తున్నాయి. ఆడియోన్స్ కొత్త సినిమా చూసామ‌ని ఫీల‌వ్వాలి. ఇత‌నేవ‌రో రెగ్యుల‌ర్ గా కాకుండా కొత్త‌గా ఆలోచించాడు అనేలా సినిమా తీయాల‌ని ఈ క‌థ ఎంచుకున్నాను. సస్పెన్స్ డ్రామా క‌థాంశంతో నాకు తెలిసినంత వ‌ర‌కు తెలుగులో ఇలాంటి సినిమా చూడ‌లేదు.

క్ష‌ణం క‌థ‌కి స్పూర్తి ఏమిటి..?

అడవి శేషు కారు డ్రైవింగ్ చేసుకుంటూ వెళుతుంటే ఒక చిన్నపాప లిఫ్ట్ అడిగింద‌ట‌. అప్పుడు చిన్న పిల్ల‌లు లిఫ్ట్ అంటూ అడ‌గుతారు క‌దా...లిఫ్ట్ ఇస్తాన‌ను అని చెప్పి కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేసేస్తే ఏమిటి ప‌రిస్థితి అనే ఐడియా వ‌చ్చింద‌ట‌. ఈ ఐడియాని సినిమా స్టైల్ లో డెవ‌ల‌ప్ చేసాం. చిన్న పాప శేష్ ని లిఫ్ట్ అడ‌గిన‌ సంఘ‌ట‌నే క్ష‌ణం క‌థ‌కి స్పూర్తి.

క్ష‌ణం లో ప్ర‌ధాన పాత్ర‌లు ఎన్ని..? ఆ పాత్ర‌ల‌ను ఎవ‌రెవ‌రు పోషించారు...?

ఇందులో మొత్తం 7 ప్ర‌ధాన పాత్ర‌లు ఉన్నాయి. అడ‌వి శేషు, ఆదా శ‌ర్మ‌, ర‌వి వ‌ర్మ‌, అన‌సూయ‌, స‌త్యం రాజేష్, వెన్నెల కిషోర్, స‌త్య‌దేవ్ ఈ పాత్ర‌లు పోషించారు. సినిమా చూస్తున్నంత సేపు ఈ ఏడుగురి ఏక్ట‌ర్స్ ఇమేజ్ క‌నిపించ‌దు. వారి క్యారెక్ట‌ర్ మాత్ర‌మే క‌నిపిస్తుంది. ఈ సినిమా బాగా వ‌చ్చిందంటే దానికి కార‌ణం ఈ ఏడుగురు ఆర్టిస్టులే.

అందాల‌ అన‌సూయ తో పోలీసాఫీస‌ర్ రోల్ చేయించ‌డానికి కార‌ణం ఏమిటి..?

నేను అంద‌రూ చేసిన‌ట్టు కాకుండా కొత్త‌గా చేయ్యాల‌నుకుంటాను. అంద‌రూ చేసిన‌ట్టే నేనూ చేస్తే నేనేంటి అనేది నా ఫీలింగ్. ఆ పీలింగ్ వ‌ల‌నే అన‌సూయ‌ను డిఫ‌రెంట్ గా చూపించాల‌ని పోలీసాఫీస‌ర్ రోల్ కి సెలెక్ట్ చేసాను.

క్ష‌ణం హైలెట్ ఏమిటి అంటే ఏం చెబుతారు..?

క్ష‌ణం సినిమాకి క‌థే హైలెట్.

మీరు ఇండ‌స్ట్రీలో ఎంట‌ర్ అవ్వ‌డానికి ఇన్ స్పిరేష‌న్ ఎవ‌రు..?

చిన్న‌ప్ప‌టి నుంచి సినిమాలంటే బాగా పిచ్చి. స‌ఖి సినిమా చూసిన‌ప్ప‌టి నుంచి నేను డైరెక్ట‌ర్ అవ్వాలి. సినిమా తీయాల‌నే ఇన్ స్పిరేష‌న్ వ‌చ్చింది. మ‌ణిర‌త్నం గారి వ‌ల‌నే ఇన్ స్పైయ‌ర్ అయి ఇండ‌స్ట్రీలో ఎంట‌ర్ అయ్యాను.

కేవ‌లం కిస్ అనే ఒక్క సినిమాకే వ‌ర్క్ చేసి ఈ సినిమాని డైరెక్ట్ చేసారు క‌దా..ఫ‌స్ట్ డే షూటింగ్ లో కాస్త టెన్ష‌న్ ప‌డ్డారా..?

ఫ‌స్ట్ నాలుగు రోజులు బాగా టెన్ష‌న్ ప‌డ్డాను. ఆత‌ర్వాత అలవాటైపోయింది.

మీకు ఎటువంటి సినిమాలంటే ఇష్టం..? నెక్ట్స్ ఎలాంటి సినిమాలు చేయాల‌నుకుంటున్నారు..?

హార్ర‌ర్ త‌ప్ప మిగిలిన అన్ని జోన‌ర్స్ లో సినిమాలు తీస్తాను. హార్ర‌ర్ చూడ‌డానికి భ‌య‌మే..తీయ‌డానికి భ‌య‌మే.

క్ష‌ణం గురించి ప్రేక్ష‌కుల‌కు ఏం చెబుతారు...

క్ష‌ణం స‌రికొత్త క‌థ‌తో తీసిన సినిమా. ఖ‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంది. ఒక మంచి సినిమా చూసామ‌నే ఫీలింగ్ క‌లిగిస్తుంది.