కలెక్టర్ ఆమ్రపాలి వార్త చదివి స్టోరీ రాసిన రవిబాబు!!
- IndiaGlitz, [Wednesday,October 30 2019]
వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ దర్శకుడిగా పేరుగాంచిన రవిబాబు ఇప్పటికే పలు హార్రర్ కామెడీ చిత్రాలను తెరకెక్కించి మంచి పేరు సంపాదించుకున్నారు. అంతేకాదు.. అదే హార్రర్ థ్రిల్లింగ్ సినిమాలను చేయడానికే ఆయన ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కథాకథనాలపై రవిబాబుకి మంచి పట్టుంది. ఆయన టేకింగ్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. తాజాగా ఆయన దర్శకత్వంలో అంతా కొత్తవారితో రాబోతున్న చిత్రం ‘ఆవిరి’. ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మించగా.. నవంబర్ 1న ‘ఆవిరి’ని థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. కాగా.. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా రవిబాబు మీడియాతో మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
సినిమాలో పాత్రపై...!
‘ఈ సినిమాలో నేను కీలకమైన పాత్ర చేయాలని ముందుగా అనుకోలేదు. వేరే ఎవరినైనా తీసుకుందామని చాలాసార్లు ప్రయత్నాలు చేశాను. అయితే ఈ పాత్రను నువ్వు చేస్తేనే బాగుంటుందేమో అని రైటర్ సత్యానంద్ గారు నాతో అన్నారు. దీంతో అప్పుడు ఆ పాత్రను చేశాను. దిల్ రాజుగారితో మంచి పరిచయం వుంది. కలిసి సినిమా చేద్దామనే ఆలోచన ఉన్నప్పటికీ ఇంతవరకూ కుదరలేదు. ఈ సినిమాను ఆయన రిలీజ్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా వుంది’ అని రవిబాబు తెలిపారు.
ఈ ఆలోచన ఎలా వచ్చింది!?
‘ఒక కొత్త స్టోరీతో చేద్దామనుకుంటున్న టైంలో పేపర్‌లో ఒక న్యూస్ చదివాను. కలెక్టర్ ఆమ్రపాలి వరంగల్‌లో ఉంటున్నప్పుడు ఆమె ఇంట్లో ఏదో దెయ్యం ఉందనే రూమర్స్ వచ్చాయి. అవి చదివినప్పుడు నాకు ఈ సినిమా ఐడియా వచ్చింది. ఐడియా అనుకున్నప్పుడు నుంచి దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాను. అలా ఆలోచించి.. ఫైనల్‌గా ఒక రెండు మూడు గంటల్లో రఫ్‌గా స్టోరీని రాసేస్తాను. ప్రస్తుతం ‘ఆవిరి’ రిలీజ్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఈ సినిమా రిలీజ్ తరువాతే తదుపరి సినిమా గురించి ఆలోచిస్తాను’ అని రవిబాబు ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు.