‘‘నా ధైర్యం అణువణువునా వుంటుంది’’: రామారావు ఆన్ డ్యూటీ టీజర్ రిలీజ్.. తాటతీస్తున్నాడుగా.. !!!

  • IndiaGlitz, [Tuesday,March 01 2022]

మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలతో బిజీగా వున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఖిలాడీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ఆయన.. ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా వెంటనే షూటింగ్‌లకు హాజరవుతున్నారు. నక్కిన త్రినాథరావు దర్శకత్వలో తెరకెక్కుతోన్న ‘‘ధమాకా’’ చిత్రీకరణలో ఇటీవల ఆయన పాల్గొన్నారు. దీని కంటే ముందే రామారావు ఆన్ డ్యూటీ అనే చిత్రాన్ని రవితేజ విడుదలకు రెడీ చేశారు.

శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ ఎల్ఎల్పి, ఆర్టీ టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు.

మహా శివరాత్రిని పురస్కరించుకుని మంగళవారం చిత్ర యూనిట్ ‘‘రామారావు ఆన్ డ్యూటీ’’ టీజర్‌ను విడుదల చేసింది. ఆయుధం మీద ఆధారపడిన నీలాంటి వాడి ధైర్యం... వాడి ఆయుధంలో ఉంటుంది. ఆయుధంలా బ్రతికే నాలాంటి వాడి ధైర్యం... అణువణువునా ఉంటుంది నేరస్థులకు త‌ప్ప‌కుండా శిక్ష ప‌డుతుంది. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినా స‌రే అని రవితేజ చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. ఈ చిత్రంలో ఆయన ప్రభుత్వాధికారిగా కనిపిస్తున్నారు. మొత్తంగా ఫుల్ లెంగ్త్ యాక్షన్ సీక్వెన్స్‌లతో విడుదలైన ఈ టీజర్ ‘‘రామారావు’’పై మరింత ఆసక్తిని పెంచేలా వుంది. అతి త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

కాగా.. దీనితో పాటు వంశీ తెరకెక్కిస్తున్న ‘‘టైగర్ నాగేశ్వ‌ర‌రావు’’. యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘‘రావణాసుర’’ అనే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మాస్ మహారాజ్.