సమ్మర్ సందడికి సై అంటున్న రవితేజ

  • IndiaGlitz, [Wednesday,February 21 2018]

సినిమా అంటే వినోదం. అటువంటి వినోదాన్ని ప్రేక్షకులకు పంచడంలో ముందుంటారు మాస్ మహారాజ రవితేజ. ఆయ‌న న‌టించ‌గా.. ఇటీవల విడుదలైన 'టచ్ చేసి చూడు' బాక్సాఫీస్ వద్ద నిరాశ‌ప‌రిచింది. అయితే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న తన తాజా చిత్రం 'నేల టికెట్' (ప్రచారంలో ఉన్న టైటిల్)తో హిట్ లోటును తీర్చేస్తానంటున్నారు రవితేజ. ఇక ఈ సినిమా టైటిల్ ను బట్టే అర్ధమవుతోంది.. ఇది పూర్తి మాస్ చిత్రమని.

అయితే కళ్యాణ్ కృష్ణ తన మార్కు ఫ్యామిలీ ఆడియన్స్ కోసం కొన్ని ఎలిమెంట్స్ ను టచ్ చేస్తూనే.. రవితేజలో ఉన్న ఎన‌ర్జీని కూడా వాడుకుంటున్నారని చిత్ర బృందం వెల్లడిస్తోంది. ఇక అనుకున్న టైంకే సినిమాను పూర్తిచేసేట్టు పక్కా ప్లానింగ్‌తో కళ్యాణ్ కృష్ణ సినిమాని చిత్రీకరిస్తున్నారు.

మాళవిక శర్మ కథానాయికగా తెరంగేట్రం చేస్తోన్న ఈ చిత్రాన్ని మే 25న విడుదల చేయడానికి నిశ్చయించినట్టు సమాచారం. ఇప్పటికే వేసవి బరిలో చాలా సినిమాలు ఉన్నాయి. వాటితో పాటు మాస్ మహారాజ సినిమా కూడా సై అంటోంది. ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్ తాళ్ళూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక ఈ మూవీ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ నటించనున్న సంగతి తెలిసిందే. అమెరికా నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఏప్రిల్ నెలాఖరు నుంచి చిత్రీకరణ జరుపుకోనుంది.