రవితేజ చిత్రంలో ఒకరేనట..

  • IndiaGlitz, [Saturday,March 03 2018]

గత ఏడాది రాజా ది గ్రేట్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మాస్ మహారాజ రవితేజ. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద మంచి ఫ‌లితాన్నే న‌మోదు చేసుకుంది. దీంతో.. గత కొంత కాలంగా నిరుత్సాహంలో ఉన్న తన అభిమానులను ఖుషీ చేయడం కోసం రవితేజ వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. ఇప్పటికే టచ్ చేసి చూడు'తో ఈ ఏడాదిలో తన ఫ్యాన్స్‌కు కనువిందు చేశారు. కాకపోతే రవితేజ మార్కు వినోదాన్ని ఆ సినిమా అందివ్వలేకపోయింది. ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో నేల టికెట్' (పరిశీలనలో ఉన్న పేరు) చిత్రంలో నటిస్తున్నారు ఈ మాస్ మ‌హ‌రాజ‌. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ సినిమాలో ర‌వితేజ‌కి జోడీగా మాళవిక శర్మ నటిస్తోంది. శక్తి కాంత్ కార్తీక్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ మూవీ సమ్మర్ స్పెషల్ గా విడుదల కానుంది.

ఇదిలా వుంటే.. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపుదిద్దుకోబోతున్న అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలో కూడా ర‌వితేజ నటిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మూడు భిన్నమైన పాత్రల్లో రవితేజ కనిపించనున్నారు. మూడు పాత్రలు కాబట్టి ముగ్గురు హీరోయిన్లకు అవకాశం ఉందని ఆ మధ్య మీడియాలో కథనాలు వచ్చాయి. కాని ఈ సినిమాలో నటించేది ఒకే హీరోయిన్ అని చిత్ర వర్గాలు వెల్లడిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ కామెడీ ఎంటర్‌టైన‌ర్‌ ఈ నెల 22వ తేదీ నుంచి చిత్రీకరణ జరుపుకోనుంద‌ని స‌మాచారం. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం కూడా ఈ ఏడాదే విడుద‌ల‌య్యే అవ‌కాశ‌ముంద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.