Eagle:రవితేజ హిట్ కొట్టినట్లేనా..? 'ఈగల్' మొదటి రోజు కలెక్షన్స్ ఎంతంటే..?

  • IndiaGlitz, [Saturday,February 10 2024]

మాస్ మహారాజా రవితేజ(Raviteja) హీరోగా నటించిన ‘ఈగల్’ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన ఈ మూవీ తొలి ఆట నుంచే హిట్ టాక్‌ తెచ్చుకుంది. యాక్షన్ సీన్స్‌లో రవితేజ అదరగొట్టేసాడని, క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ అయితే వేరే లెవల్‌గా ఉందని చెబుతున్నారు. అలాగే విజువల్స్ కూడా సూపర్బ్‌గా ఉన్నాయంటున్నారు. దీంతో మూవీ చూసేందుకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో మొదటి రోజు డీసెంట్‌ కలెక్షన్స్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఈగల్' మూవీకి నైజాంలో రూ. 6.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 8.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగు రాష్ట్రాలో రూ. 17.00 కోట్లకు థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోయాయి. అలాగే కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ.2 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ.2 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ.21.00 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే రూ.42 కోట్లు రాబడితే మూవీ లాభాల్లోకి రానుంది. అయితే మొదటి రోజే రూ.12 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు సమాచారం.

ఇక ఇవాళ, రేపు వీకెండ్ కావడంతో పాటు పెద్ద సినిమాలు లేకపోవడంతో మూవీ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. హిట్ టాక్ రావడంతో వీకెండ్ పూర్తయ్యే లోపు రూ.50కోట్ల వసూళ్లు రాబట్టడం ఖాయమని అంచనా వేస్తున్నారు. అంటే మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అవుతుందని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. మరి బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు కొల్లగొడుతుందో వేచి చూడాలి.

ఇక ఈ సినిమాలో కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్‌లు హీరోయిన్లుగా నటించగా.. నవదీప్, వినయ్ రాయ్, అవసరాల శ్రీనివాస్, మధుబాల, తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. ఇదిలా ఉంటే రవితేజ తర్వాత సినిమాల విషయానికొస్తే హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నారు.