హైదరాబాద్‌లో ధమాకా కొత్త షెడ్యూల్.. రవితేజపై యాక్షన్ ఎపిసోడ్స్

  • IndiaGlitz, [Friday,February 25 2022]

మాస్ మహారాజ్ రవితేజ మంచి జోష్‌లో వున్న సంగతి తెలిసిందే. ఆయన చేతుల్లో నాలుగైదు సినిమాలు వున్నాయి. ఇప్పటికే ‘‘ఖిలాడి’’ సినిమాను రిలీజ్ చేసి ఫర్వాలేదనిపించుకున్నారు రవితేజ. ఆ వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ‘‘ధమాకా’’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు మాస్ మహారాజా. ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. ఖిలాడీ మాదిరిగానే ఈ సినిమాలోనూ ఇద్దరు హీరోయిన్లు వున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్, సహ నిర్మాతగా వివేక్ కూచిబొట్ల వ్యవహరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ధమాకా కొత్త షెడ్యూల్ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభ‌మైంది. రవితేజ, ఫైటర్స్‌పై భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తోంది చిత్ర యూనిట్‌. ఈ ఎపిసోడ్‌ని రామ్-లక్ష్మణ్ మాస్టర్లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడు తెరకెక్కించే యాక్షన్ ఎపిసోడ్ చిత్రానికి చాలా కీలకమని, అందుకే ఖర్చు విషయంలో రాజీ పడకుండా భారీ సెట్‌ వేశామన్నారు. మాస్ ఆడియ‌న్స్‌కి, యాక్షన్‌ సినిమాల ప్రియులకు ఇది త‌ప్ప‌కుండా నచ్చుతుందని వారు ఆకాంక్షించారు.

'పెళ్లి సందడి' ఫేమ్ శ్రీలీల ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు. మిగిలిన నటీనటుల వివరాలు తెలియాల్సి వుంది. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నారు. భీమ్స్ సిసిరిలియో స్వరాలు సమకూరుస్తుండగా.. కార్తీక్ ఘట్టమనేని కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.