Ravi Prakash: రవి ప్రకాష్ కొత్త ఛానెల్.. బీజేపీ నేత పెట్టుబడులు, తెలుగు మీడియాలో మరో సంచలనమేనా.?
- IndiaGlitz, [Monday,December 19 2022]
టీవీ 9 రవిప్రకాష్.. (TV9 RaviPrakash) తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారు లేరు. తెలుగు మీడియాలో ఆయనో సంచలనం. సిటీకేబుల్‌లో సాధారణ రిపోర్టర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన రవిప్రకాష్ ఓ శాటిలైట్ ఛానెల్ సీఈవో స్థాయికి ఎదిగారు. టీవీ 9ని స్థాపించి.. అప్పటి వరకు మూసలో సాగుతోన్న వార్తా స్రవంతికి స్వస్తి చెప్పారు. ఉదయం , మధ్యాహ్నం, రాత్రి ఇలా మూడు బులెటిన్లు మాత్రమే వార్తా ప్రసారాలు వున్న రోజుల్లో ఏకంగా 24 గంటల న్యూస్ ఛానెల్‌ను స్థాపించి సంచలనం సృష్టించారు. మీడియా అంటే ఇది అని , ఆధునిక టెక్నాలజీని వినియోగించి.. అత్యంత వేగంగా వార్తను ప్రేక్షకుడికి చెరవేశారు. టీవీ 9 స్పూర్తితోనే తెలుగునాట 24 గంటల వార్తా ఛానెల్స్ కుప్పలు తెప్పలుగా ఆవిర్భావించాయి.
ఫోర్జరీ కేసుతో మసకబారిన రవిప్రకాష్ (Ravi Prakash) ప్రభ:
టీవీ9ని దేశవ్యాప్తంగా విస్తరిస్తూ దూసుకెళ్తున్న సమయంలో ఫోర్జరీ కేసుతో ఆయన ప్రభ మసకబారింది. టీవీ9 (TV9)ని దక్కించుకున్న వ్యక్తులు .. కంపెనీ నిధులు దారి మళ్లించారని అలంద మీడియా (Alanda Media) ప్రతినిధులు పలు అభియోగాలు మోపారు. దీంతో అరెస్టయి, అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. తర్వాతి నుంచి రవిప్రకాశ్‌పై రకరకాల కథనాలు వచ్చాయి. పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖుల అండదండలతో ఆయన మరో ఛానెల్‌కు ప్లాన్ చేశారని పుకార్లు షికార్లు చేశాయి. కానీ వీటిలో ఏ ఒక్కటి నిజం కాలేదు.
వచ్చేదంతా ఎన్నికల సీజనే :
ఇదిలావుండగా..రవి ప్రకాశ్ కొత్త ఛానెల్‌కు సంబంధించి తాజాగా మరో వార్త వైరల్ అవుతోంది. బీజేపీ (BJP) నేత సుజనా చౌదరి (Sujana Choudary) మద్ధతుతో రవిప్రకాశ్.. ఛానెల్ పెట్టబోతున్నారంటూ మీడియా సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల కొన్ని కేసుల నుంచి బయటపడిన సుజనా చౌదరి.. పలు కంపెనీల్లోని తన పెట్టుబడులను ఉపసంహరించుకున్నారట. అలా వచ్చిన సంపదను రవిప్రకాశ్ ఛానెల్ కోసం పెట్టుబడిగా పెట్టుబోతున్నారట. వచ్చే ఏడాది తెలంగాణ ఎన్నికలు, ఆ తర్వాతి ఏడాది ఏపీ అసెంబ్లీకి, లోక్‌సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రవిప్రకాశ్ తాను ఛానెల్ పెట్టడానికి ఇదే మంచి సమయంగా భావిస్తున్నారట. అంతా బాగానే వుంది కానీ ఇందులో ఎంత వరకు నిజం వుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.