ఆధారాలున్నాయ్.. రవిప్రకాష్, శివాజీ తప్పించుకోలేరు!

  • IndiaGlitz, [Friday,May 17 2019]

టీవీ9 రవిప్రకాష్‌‌, గరుణ పురాణం శివాజీపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం మధ్యాహ్నం ట్విట్టర్ వేదికగా.. మీడియా 'నయీం' నేరాలపై దర్యాప్తు ఆధికారులు పక్కా ఆధారాలు సేకరించారు. గరుడ పురాణం బ్రోకర్ శొంఠినేని శివాజీ కూడా తప్పించుకోలేడు. 14 నెలల క్రితం రవి ప్రకాష్‌ తనకు షేర్లు విక్రయించాడని రాసుకున్న అగ్రిమెంటు పత్రం తాజాగా సృష్టించినదే అని వెల్లడైంది. చట్టాలంటే ఎంత చులకనో వీళ్లకు. అప్పట్లో నట్వర్‌లాల్‌ అనే చీటర్‌ తాజ్‌మహల్‌నే అమ్మేశాడని తెలిసి విస్తుపోయాం. ఫోర్జరీ, నిధుల స్వాహా, షేర్ల అమ్మకాలు(బోగస్‌), టీవీ9 ట్రేడ్‌మార్క్‌, కాపీరైట్‌ అమ్మకాలు... రోజుకొకటి చొప్పున వెలుగు చూస్తున్న ‘మెరుగైన సమాజం’ ప్రొడ్యూసర్‌ మోసాలు నైజీరియన్‌ మోసగాళ్ళను తలపిస్తున్నాయి అని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.

ఇది చంద్రబాబుకు కనిపించలేదా?

పశ్చిమ బెంగాల్‌లోని ఒక పోలింగ్ బూత్‌లో ఓటర్లకు బదులు ఒక మహిళా అధికారి తానే తృణమూల్ గుర్తు బటన్ నొక్కుతున్న వీడియో వైరల్‌గా మారింది. ఇది చంద్రబాబుకు కనిపించలేదా?. ఎలక్షన్‌ కమిషన్‌ మెతగ్గా వ్యవహరించి ఉంటే తాను కూడా ఏపీలో ఇదే తరహా రిగ్గింగుకు పాల్పడేవాడు కాదా?. చంద్రగిరి నియోజకవర్గంలోని 5 పోలింగ్ బూతుల్లో దళితులను బెదిరించి టీడీపీ రిగ్గింగుకు పాల్పడిన ఆరోపణలు రుజువు కావడంతో ఈసీ రీపోలింగుకు ఆదేశించింది. అక్రమాలకు పాల్పడకపోతే వాళ్లకెందుకు భయం. రీపోలింగు అన్యాయం అంటూ ఆందోళనకు దిగడమేమిటి సిగ్గులేకుండా? దళితులు ఈసారి సత్తా చూపాలి అని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. విజయసాయి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు, రవిప్రకాష్, శివాజీ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.