APTA: ఎన్ఆర్ఐ సంస్థ ఏపీటీఏ సలహాదారుగా రవణం స్వామి నాయుడు.. !!
- IndiaGlitz, [Tuesday,February 21 2023]
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికా గడ్డపైకి ప్రతి ఏటా వేలాది మంది భారతీయులు వెళ్తూ వుంటారు. ఇందులో మన తెలుగువారు కూడా వుంటారు. అక్కడి ఎన్ఆర్ఐలలో తెలుగువారి ప్రాబల్యం కూడా ఎక్కువే. అయితే ఆల్రెడీ అమెరికాలో స్థిరపడిన వారితో పాటు కొత్తగా అగ్రరాజ్యానికి వచ్చే భారతీయుల కోసం అక్కడ అనేక ప్రవాస భారతీయ సంఘాలు వున్నాయి. మన తెలుగువారి కోసం కూడా పలు సంస్థలు పనిచేస్తున్నాయి. ఇమ్మిగ్రేషన్, వసతి, ఉద్యోగం, విద్య, ఇలా అన్ని రకాలుగా తెలుగువారికి అండగా నిలుస్తున్నాయి ఆయా సంఘాలు. ఇక ఎన్ఆర్ఐ తెలుగు అసోసియేషన్ ఎన్నికలు మన దేశంలో జరిగే సాధారణ ఎన్నికల రేంజ్లో జరుగుతూ వుంటాయి.
అమెరికాలో తెలుగు వారికి బాసటగా ఏపీటీఏ:
అందులో ఒకటి అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఏపీటీఏ). ఈ సంస్థ అమెరికాలోని తెలుగువారికి ఏ కష్టమొచ్చినా అన్నీ తానై ముందు నిలుస్తోంది. యూఎస్‌లో తెలుగు ప్రజలకు అత్యవసర సేవలు, విద్యార్ధులకు ఉన్నత విద్యలో సహాయం చేయడం, తెలుగు సంస్కృతిని రక్షించుకోవడం వంటి సేవలను అందిస్తోంది.
చిరు పేరుతో సామాజిక సేవ చేస్తున్న స్వామి నాయుడు:
తాజాగా ఏపీటీఏ గ్లోబల్ ఆపరేషన్స్ (బ్లడ్ డ్రైవ్‌లు, కంటి శిబిరాలు) సలహాదారుగా అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు, చిరంజీవి చారిటబుల్ ట్రస్టు,చిరంజీవి అభిమాన సంఘాల అంతర్జాతీయ అధ్యక్షులు రవణం స్వామి నాయుడు నియమితులయ్యారు. మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని అయిన రవణం స్వామి నాయుడు అనేక సంవత్సరాలుగా రక్త, నేత శిబిరాలు నిర్వహించడంతో పాటు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. ఆయన నియామకంపై పలువురు ఎన్ఆర్ఐలు, చిరంజీవి అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు.
ఏపీటీఏ గ్లోబల్ ఆపరేషన్స్ కమిటీ ఇదే:
ఇక ఏపీటీఏ గ్లోబల్ ఆపరేషన్స్ కమిటీ విషయానికి వస్తే.. మధువుల్లి (ఛైర్మన్), ప్రియాంక గడ్డం (వైస్ ఛైర్మన్), శ్రీనివాస్ బోగిరెడ్డి (వైఎస్ ఛైర్మన్)లుగా నియమితులయ్యారు. వీరందరికీ ఏపీటీఏ ప్రెసిడెంట్ ఉదయభాస్కర్ కొట్టే అభినందనలు తెలిపారు.