సాధినేని యామినికి అమెరికాలో అరుదైన గౌరవం

  • IndiaGlitz, [Monday,May 04 2020]

ఫైర్‌బ్రాండ్‌గా పేరుగాంచిన బీజేపీ నాయకురాలు సాధినేని యామిని శర్మకు అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. అమెరికాలోని భారతీయ యువ పారిశ్రామికవేత్తల సంఘం (సీఐఎంఎస్ఎంఈ) గౌరవాధ్యక్షురాలిగా సాధినేని యామిని శర్మ నియమితులయ్యారు. కాగా ఈ సంఘం భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తుంది.

ఎవరీ యామినీ శర్మ!?

కాగా.. యామినిది గుంటూరు జిల్లా తండ్రి ఉద్యోగ రీత్యా కుటుంబం మొత్తం హైదరాబాద్‌లో సెటిల్ అయ్యింది. హైదరాబాద్ ప్రాథమిక విద్య పూర్తి చేసిన ఆమె తర్వాత ఉన్నత చదువుల కోసం ఇతరదేశాలకు వెళ్లారు. మొదట ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో మాస్టర్ డిగ్రీ చేశారు. ఆ తర్వాత వైర్‌లెస్ కమ్యూనికేషన్ రంగంపై ఆసక్తితో ఆ రంగంలో అడుగు పెట్టారు. అమెరికా, జెర్మనీ, ఆస్ట్రేలియా లాంటి దేశాలలో వైర్‌లెస్ కమ్యూనికేషన్‌కు సంబంధించి వివిధ కోర్సులను పూర్తి చేశారు. అలా 22 ఏళ్ల వయసులోనే యామిని ‘హం ఆపరేటర్‌ల బృందం’ లో ప్రముఖ పాత్ర పోషించారు. తుపాన్ వరదల సమయంలో టెలి కమ్యూనికేషన్ పనిచేయనప్పుడు ‘హం’ కమ్యూనికేషన్ వ్యవస్థను ఉపయోగిస్తారు. ఈ క్రమంలో ఆమె పలు అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. మరీ ముఖ్యంగా ఏపీలో హుద్ హుద్, లైలా తుపాను సమయంలో ఆమె అనేక సేవలు అందించారు.

రాజకీయాల్లోకి ఇలా..

ఆ తర్వాత ఫార్మాసిటికల్ బిజినెస్ రంగం‌లో తన విస్తృతమైన అనుభవంతో సొంత పరిశ్రమను స్థాపించి అనేక మందికి ఉపాధి కలిగించారు. అలా పారిశ్రామికవేత్తగా మారిన ఆమె తక్కువ కాలంలోనే 6కోట్ల టర్నోవర్ సాధించారు. వివిధ దేశాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, సెలెబ్రిటీలతో ఆమె మన్ననలు పొందారు. అలా అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో పరిచయాలు ఏర్పడటంతో రాజకీయాల వైపు అడుగులేశారు. యామిని సేవలు వినియోగించిన బాబు.. ఆంధ్రప్రదేశ్ నైపుణ్య మరియు పారిశ్రామిక ఫోరమ్ కౌన్సిల్ సభ్యురాలితో పాటు.. సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి ప్రణాళికను అనుసంధానం చేసే బాధ్యతలను అప్పగించారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. టీడీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు. అలా ఫైర్ బ్రాండ్‌గా మారారు. ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడం ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల దృష్ట్యా టీడీపీకి టాటా చెప్పేసి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నారు.