Rarandoi Veduka Chudham Review
అక్కినేని నాగచైతన్య ఏం మాయ చేసావే, సాహసం శ్వాసగా సాగిపో వంటి ప్రేమకథా చిత్రాలు, యాక్షన్ థ్రిల్లర్స్‌లో నటిస్తూ వచ్చాడు. ఈసారి నాగచైతన్య నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ `రారండోయ్ వేడుకచూద్దాం`. బాహుబలి-2 వంటి విజువల్ వండర్ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై వచ్చిన మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. సోగ్గాడే చిన్ని నాయనాతో హిట్ కొట్టిన దర్శకుడు కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఈ చిత్రం పోస్టర్స్, లుక్, ట్రైలర్ చూసిన వారికి కలర్‌ఫుల్ మూవీ అని తెలిసింది. అక్కినేని అభిమానులు నన్ను ఎలా చూడాలనుకుంటారో అలా రారండోయ్ చిత్రంలో కనపడతానని చైతు అభిమానులకు మరింత ఉత్సాహాన్నిచ్చాడు. దీంతో సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి రారండోయ్ వేడుక చూద్దాం సినిమా అంచనాలను అందుకుందా లేదా అని చూడాలంటే ముందు కథలోకి వెళదాం..
కథ:
కృష్ణ(జగపతిబాబు), ఆది(సంపత్), వీరభద్ర మంచి స్నేహితులు. ఆది చెల్లెలు నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజు కృష్ణతో కలిసి పారిపోతుంది. నమ్మిన స్నేహితుడే తనను మోసం చేయడంతో ఆదికి కృష్ణ అంటే ద్వేషం ఏర్పడుతుంది. కృష్ణ వైజాగ్ వెళ్లిపోయి కన్‌స్ట్రక్షన్ బిజినెస్‌లో ఎదుగుతాడు. ఆదికి కూతురు పుడుతుంది. ఆ అమ్మాయికి భ్రమరాంబ(రకుల్ ప్రీత్ సింగ్) అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. భ్రమరాంబకు తండ్రి అంటే చాలా ప్రేమ, దేవుడంటే విపరీతమైన భక్తి ఉంటాయి. తన కోసం తన తండ్రి రాజకుమారుడిని తెచ్చి పెళ్ళి చేస్తాడని భ్రమరాంబ నమ్ముతుంటుంది. ఆది తన స్నేహితుడి కూతురి పెళ్ళికి కుటంబంతో కలిసి వెళతాడు. అదే పెళ్ళికి వచ్చిన కృష్ణ కొడుకు శివ(నాగచైతన్య), భ్రమరాంబను చూసి ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమను పొందాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇదే క్రమంలో వైజాగ్‌లో ఎంబిఎ చదువుకోవడానికి వచ్చిన భ్రమరాంబకు స్నేహితులెవరూ లేకుంటే శివతోనే మాట్లాడుతుంటుంది. శివ కూడా తన ప్రేమను చెప్పకుండా భ్రమరాంబకు సహాయం చేస్తుంటాడు. పరిస్థితులు భ్రమరాంబకు శివపై ప్రేమ కలిగిస్తాయి. కానీ ఈలోపు తండ్రి భ్రమరాంబకు ఆమె బావతో పెళ్ళి కుదురుస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? భ‌్రమరాంబ తండ్రి చెప్పిన వాడిని పెళ్ళి చేసుకుంటుందా? లేదా శివను చేసుకుంటుందా? అసలు కృష్ణ, ఆది మధ్య అపార్థాలకు కారణమెవరు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
ప్లస్‌పాయింట్స్:
- నటీనటులు పనితీరు
- సంగీతం
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
- కామెడి
- కొత్తదనం లేని కథ
విశ్లేషణ:
నాగచైతన్య తన క్యారెక్టర్ పరంగా చాలా ఈజ్‌ను ప్రదర్శిస్తూ నటించాడు. చైతు నటించిన గత చిత్రాలకు భిన్నంగా అతని క్యారెక్టర్ డిజైన్ చేయబడింది. అందుకు తగిన విధంగా చైతన్య మంచి ఎనర్జిటిక్‌గా నటించాడు. చైతు బాడీ లాంగ్వేజ్‌లో మార్పు కనపడుతుంది. ఇది వరకు సినిమాల్లో మోడ్రన్‌గా, గ్లామర్‌గా కనపడ్డ రకుల్ ప్రీత్ సింగ్ రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో హాఫ్ శారీలో, పంజాబీ డ్రెస్స్‌లలో కనపడింది. చూడటానికి చాలా చక్కగా ఉంది. నటన పరంగా చూస్తే పెర్‌ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో చక్కగా నటించింది. మొండితనం, పెంకితనం, మంచితనం కలగలిసిన అమ్మాయిగా మంచి అభినయాన్ని కనపరిచింది. ఫ్రెండ్లీ ఫాదర్ క్యారెక్టర్‌లో జగపతిబాబు చాలా ఈజీగానటించేశాడు. ఇక రకుల్ తండ్రి పాత్రలో నటించిన సంపత్ కూడా మొరటు విలన్‌గా కాకుండా సాఫ్ట్ నేచుర్ ఉన్న విలనిజంతో కూడిన తండ్రి పాత్రలో మెప్పించాడు. ఇక వెన్నెలకిషోర్ కామెడి ట్రాక్ ప్రేక్షకులను నవ్విస్తుంది. పెళ్ళి సందడిలో వచ్చే పోసాని, తాగుబోతు రమేష్, రఘుబాబు, పృథ్వీ, సప్తగిరి కామెడి ట్రాక్ పెద్దగా నవ్వించదు. ఇక టెక్నిషియన్స్ విషయానికి వస్తే, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ట్విస్టులతో కూడిన కథనేం తెరకెక్కించే ప్రయత్నం చేయలేదు. ఇద్దరు స్నేహితులు మధ్య, రెండు కుటుంబాల మధ్య గొడవను ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. ఓ రకంగా చూస్తే నిన్నేపెళ్ళాడతా స్టయిల్లో ఉండే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. తండ్రి అంటే ప్రేమ ఉండే కూతురు, అలాగే కూతురంటే ప్రేమ ఉండే తండ్రి, స్నేహితుల్లా కలిసి ఉండే తండ్రి కొడుకులు ఇలా కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు అన్నింటిని చక్కగా తెరకెక్కించారు. దేవిశ్రీ ప్రసాద్ సన్నివేశాలకు తగిన విధంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించడమే కాదు, చక్కటి ట్యూన్స్ కూడా ఇచ్చాడు. టైటిల్ ట్రాక్‌తో పాటు, తకిట తకిజుమ్.., భ్రమరాంబకు నచ్చేశాను.., సాంగ్స్ అన్నీ బావున్నాయి. విశ్వేశ్వర్ తన సినిమాటోగ్రఫీతో సన్నివేశాలకు రిచ్‌నెస్‌ను తెచ్చి పెట్టాడు. నిర్మాణ విలువలు బావున్నాయి.
బోటమ్ లైన్: రారండోయ్ వేడుక చూద్దాం..ఆకట్టుకునే కుటుంబ కథా చిత్రం
Rarandoi Veduka Chudham English Version Review
- Read in English