సినీ నటికి కూల్‌డ్రింకులో మత్తు మందు కలిపి ఇచ్చి అత్యాచారం..

  • IndiaGlitz, [Sunday,July 05 2020]

ఓ ప్రైవేటు సంస్థకు సీఈవోగా ఓ బహుభాషా నటితో పరిచయం పెంచుకున్నాడో వ్యక్తి. ఆపై ఆమెకూ తమ కంపెనీలోనే ఉద్యోగం కల్సించాడు. దీంతో ఆమె దగ్గరయ్యాడు. పుట్టినరోజు పార్టీ అని పిలిచి కూల్ డ్రింకులో మత్తు మందు కలిపిచ్చి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయమై సదరు నటి బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కన్నడ, తమిళ సినిమాల్లో నటించిన ఓ మహిళ బెంగుళూరు జేజే నగర్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంటులో నివాసముంటోంది. 2018లో మోహిత్ అనే వ్యక్తి తనకు పరిచయమైనట్టు ఆమె తెలిపింది. ఓ ప్రైవేటు కంపెనీలో సీఈవోనని పరిచయం చేసుకుని.. కొద్ది రోజుల అనంతరం అతని కంపెనీలోనే తనకూ ఉద్యోగమిచ్చాడని తెలిపింది. ఈ క్రమంలోనే సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తన నుంచి అందినకాడికి డబ్బులు గుంజాడని సదరు నటి తెలిపింది. 2019 జూన్ 23న తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ చేసుకున్నామని బాధిత నటి తెలిపింది.

ఆ పార్టీలో తనకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి తనపై మోహిత్ అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దానినంతా సెల్‌ఫోన్‌లో షూట్ చేసి తనను బెదిరిస్తూ ఇప్పటి వరకూ రూ.20 లక్షలు గుంజాడని బాధితురాలు వెల్లడించింది. విషయాన్ని అతడి తల్లిదండ్రులకు చెప్పినా ఉపయోగం లేకుండా పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మోహిత్ కోసం గాలించడంతో పాటు అతనికి సపోర్ట్ ఇచ్చిన తల్లిదండ్రులను సైతం విచారిస్తున్నారు.