యువతిపై అత్యాచారయత్నం.. నిందితులకు చుక్కలు చూపించిన పోలీసులు
- IndiaGlitz, [Thursday,February 11 2021]
హైదరాబాద్ శివార్లలో మరో దారుణం.. దిశను గుర్తుకు తెచ్చే ఘటన.. కానీ ఇక్కడ పోలీసులు క్షణాల్లో స్పందించారు. బాధితురాలి ఫోన్ సిగ్నల్ ఆధారంగా చేజ్ చేశారు. అందుబాటులో ఉన్న పోలీస్ వెహికిల్స్ అన్నీ దారుణాన్ని అడ్డుకునేందుకు బయల్దేరాయి. నిందితులు బాధితురాలితో ఎటు వెళ్లినా పోలీస్ సైరన్ల మోత వారి గుండెల్లో దడ పుట్టించింది. అంతే.. బాధితురాలిని పొదల్లో వదిలేసి పారిపోయారు. అక్కడకు చేరుకున్న పోలీసులు వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. అలాగే క్షణాల్లో నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
అసలు విషయంలోకి వెళితే.. మేడ్చల్‌లోని ఓ కళాశాలలో బీ-పార్మసీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని (19) సాయంత్రం 6.15 గంటలకు రాంపల్లి చౌరస్తా వద్ద కళాశాల బస్సు దిగింది. అక్కడి నుంచి తమ ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. వెంటనే తన తండ్రికి ఫోన్ చేసి ఇంటికి వస్తున్నట్టు చెప్పింది. ఆటోలో డ్రైవర్‌తో పాటు ఓ మహిళ, మరో వ్యక్తి ఉన్నారు. కొంతదూరం వెళ్లాక మహిళ దిగిపోయింది. వెంటనే ఆటోలో ఉన్న వ్యక్తి ఫోన్ చేసి మరో ఇద్దరిని పిలిపించి.. మార్గమధ్యంలో ఎక్కించాడు. ఆ విద్యార్థిని దిగాల్సిన స్టేజి వచ్చింది. కానీ ఆటోను ఆపకుండా
ఘట్‌కేసర్ వైపునకు వేగంగా వెళ్లాడు. వెంటనే కీడు శకించిన సదరు యువతి తల్లిదండ్రులకు తన ఫోన్ నుంచి సమాచారం అందించింది. వారు వెంటనే స్థానిక కౌన్సిలర్‌తోపాటు పోలీసులకు సమాచారం అందించారు.
గంటన్నర లోపే ట్రేస్ చేసిన పోలీసులు
సాయంత్రం 6.29 గంటలకు పోలీసులకు కాల్ వచ్చింది. పోలీసులు క్షణం కూడా లేటు చేయలేదు. భారీ సంఖ్యలో పోలీసు వాహనాలు విద్యార్థిని ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా బయల్దేరాయి. అప్పటికే నిందితులు సదరు యువతిని యన్నంపేటలో ఆటో నుంచి వ్యాన్‌లోకి మార్చారు. ఈ క్రమంలోనే ఆమెపై దాడికి పాల్పడ్డారు. అయితే ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. ఈ పెనుగులాట కొనసాగుతుండగానే వ్యాన్‌ను ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ వైపు మళ్లించారు. కానీ పోలీసులు వారిని వదల్లేదు. ఎటు వెళ్లినా పోలీసు వాహనాలు పెద్ద ఎత్తున సైరన్‌లతో వెంబడించాయి. దీంతో భయపడిన నిందితులు యువతిని అవుటర్ రింగ్ రోడ్డు అన్నోజిగూడ పాయింట్ దగ్గర సర్వీసు రోడ్డు పొదల్లో విసిరేసి పారిపోయారు. నిమిషాల వ్యవధిలో అక్కడికి పోలీసు వాహనం ఆ పొదల వద్దకు చేరుకుంది. స్పృహ తప్పి పడి ఉన్న యువతిని ఓ ఎస్సై భుజంపై వేసుకొని వాహనంలోకి చేర్చి, వేగంగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. 7.50 గంటలకు యువతిపై ఎలాంటి అఘాయిత్యమూ జరగకుండా అడ్డుకుని రక్షించగలిగారు.
పోలీసుల పాత్రే కీలకం..
విషయం తెలిసిన వెంటనే ఏమాత్రం పోలీసులు నిర్లక్ష్యం వహించలేదు. పైగా భారీ సంఖ్యలో వాహనాలతో యువతి సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ట్రేస్ చేశారు. గంటన్నర లోపే నిందితులను పూర్తిగా తమ వాహనాలతో బ్లాక్ చేసి ఎటూ వెళ్లనీయకుండా అడ్డుకోగలిగారు. ఒకరకంగా నిందితులకు చుక్కలు చూపించారు. ప్రస్తుతం పోలీసుల అప్రమత్తతపై ప్రశంసల జల్లు కురిస్తోంది. ఘటన వివరాలను మల్కాజ్‌గిరి డీసీపీ రక్షిత కృష్ణమూర్తి విలేకర్లకు వెల్లడించారు. విద్యార్థిని అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలిపారు. పోలీసులు సత్వరం స్పందించడంతోనే తమ కుమార్తెకు ముప్పు తప్పిందని తల్లిదండ్రులు సైతం వెల్లడించారు. నిందితులంతా పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.