Tamil »
Interviews »
పరభాషా నటీనటులకు మనం స్వాగతం చెబుతాం.. వాళ్లు మాత్రం మనకి అవకాశాలు ఇవ్వరు.. కారణంఅదే..! రావు రమేష్
పరభాషా నటీనటులకు మనం స్వాగతం చెబుతాం.. వాళ్లు మాత్రం మనకి అవకాశాలు ఇవ్వరు.. కారణంఅదే..! రావు రమేష్
Saturday, December 17, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుని అనతికాలంలోనే సుస్ధిర స్ధానాన్ని సంపాదించుకున్న విలక్షణ నటుడు రావు రమేష్. గమ్యం, మగధీర, కొత్త బంగారులోకం, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద, సుబ్రమణ్యం ఫర్ సేల్...ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన రావు రమేష్ తాజాగా నటించిన చిత్రం నాన్ననేను నా బాయ్ ఫ్రెండ్స్. ఈ చిత్రంలో రావు రమేష్ నటించిన తండ్రి పాత్రకు అటు ప్రేక్షకులు, ఇటు ఇండస్ట్రీ నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఈ సందర్భంగా రావు రమేష్ చెప్పిన సమ్ గతులు మీకోసం...!
దిల్ రాజే కారణం..!
ఈ సినిమా రిలీజైనప్పటి నుంచి నాకు చాలా గౌరవమైన ఫోన్ కాల్స్ వస్తున్నాయి. తండ్రి పాత్ర కాబట్టి నిజ జీవితంలో ఎలా ఉంటుందో అలాగే ఈ పాత్ర చేసాను. అందుచేత ఈ క్యారెక్టర్ కి ఆడియోన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు అనుకుంటున్నాను. దిల్ రాజు గారికి ఈ కథ చెప్పినప్పుడు ఆయనకు బాగా నచ్చింది. ఆయన కొన్ని విలువలైన సలహాలు ఇచ్చారు. అవి బాగా వర్కవుట్ అయ్యాయి. ఈ సినిమా, ఈ సినిమాలోని నా పాత్ర ఇంత బాగా వచ్చింది అంటే దానికి దిల్ రాజు గారు కూడా ఒక కారణం అని చెప్పచ్చు.
ది బెస్ట్ క్యారెక్టర్ ఇదే..!
డైరెక్టర్ భాస్కర్ ఓ మంచి కథ చెప్పాలి అనుకున్నాడు.దీనికి చోటా కె నాయుడు కెమెరా ఎస్సెట్ గా నిలిచింది. ఆయన సరైన టైమ్ లో సలహాలు ఇచ్చేవారు. అది సినిమాకి హెల్ప్ అయ్యింది. అందరూ కలిసి మంచి సినిమా చేయాలి అనుకోవడం వలన గొప్ప సక్సెస్ ఫుల్ ఫిల్మ్ వచ్చింది అనుకుంటున్నాను. ప్రతి సినిమాకి ఇదే ది బెస్ట్ అంటుంటాం. కానీ...నిజంగానే ఇప్పటి వరకు ఈ సినిమాలో క్యారెక్టర్ ది బెస్ట్ అనిపిస్తుంది.
అనిర్వచనీయమైన ఫీలింగ్..!
రియల్ లైఫ్ లో కూడా ఒక తండ్రిగా మా అమ్మాయితో అలాగే ఉంటాను. నాకు ఒక కొడుకు, కూతురు. మా అమ్మాయి ఏం అడిగినా మా ఆవిడ నో చెబుతుంటుంది. అదే నేను అయితే...మా అమ్మాయి ఇది కావాలి అనగానే వెంటనే ఎస్ అంటాను. మా అమ్మాయి పేరు దీక్షిత. ఏ తండ్రికి అయినా కూతురు అంటే అదే ప్రేమ ఉంటుంది. కూతురు పై ప్రేమ అంటే నిర్వచించలేం. అనిర్వచనీయమైన ఫీలింగ్.
ఆనందాన్ని ఇచ్చిన ఆ.. అభినందన..!
ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది ఫోన్ చేసి అభినందిస్తున్నారు. ముఖ్యంగా రైటర్ తోటపల్లి మధు గారు ఫోన్ చేసి నా క్యారెక్టర్ చాలా బాగుంది అని అభినందించి ఇక నుంచి నీకు డైలాగ్స్ రాయాలంటే బంగారు పెన్నతో వెండి కాగితం పై రాయాలి అన్నారు. ఆయన అలా అభినందించడం నిజంగా చాలా సంతోషంగా ఫీలయ్యాను. ఈ చిత్రంలో నటించిన ఆర్టిస్టుల గురించి చెప్పాలంటే...హెబ్బా పటేల్ సెట్స్ లో చాలా నార్మల్ గా, అమాయకంగా ఉంటుంది. ఆమెకి ఇలాంటి క్యారెక్టర్ రావడం అదృష్టం. ఈ చిత్రంలో నటించిన హెబ్బాపటేట్, అశ్విన్, పార్వతీశం, నోయల్ వీళ్లంతా వాళ్ల క్యారెక్టర్స్ కి తగ్గట్టు నటించడంతో సినిమా ఇంత బాగా వచ్చింది.
హోమ్ వర్క్ చేయను..!
నేను ఏ పాత్రకైనా ముందుగా హెమ్ వర్క్ చేయడం, ప్రీపేర్ అవ్వడం లాంటివి చేయను. అలా చేస్తే రియలిస్టిక్ గా రాదు అనేది నా అభిప్రాయం. శ్రీకాంత్ అడ్డాల సీన్ స్టార్ట్ చేసే వరకు డైలాగ్స్ ఏమిటో... ఎలా చెప్పాలో..ఆయన నాకు చెప్పరు. కెమెరా ముందుకు వెళ్లిన తర్వాతే ఏం
చేయాలో చెబుతారు. డైరెక్టర్సే నన్ను క్యారెక్టర్ మూడ్ లోకి తీసుకువెళ్లి ఆ పాత్రకు తగ్గట్టు ఎలా కావాలో అలా నాతో చేయించుకుంటారు.
నాకు బాగా కిక్ ఇచ్చిన క్యారెక్టర్..!
పవన్ కళ్యాణ్ నటిస్తున్న కాటమరాయుడు సినిమాలో విలన్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఇందులో రాయలసీమ యాసలో మాట్లాడతాను. ఈ మూవీలో నేను కనిపించేది ఐదారు సన్నివేశాల్లోనే కనిపిస్తాను. కానీ...ఆ క్యారెక్టర్ ప్రభావం మాత్రం సినిమా అంతా ఉంటుంది. నాకు బాగా కిక్ ఇచ్చిన క్యారెక్టర్ ఇది. ఈ సినిమాలో నా పాత్ర నా కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోతుంది.
కెరీర్ లో ప్రయోగాత్మక పాత్ర..!
నాగార్జున ఓం నమో వేంకటేశాయ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాను. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో మా నాన్న గారు నటించారు. ఇప్పుడు రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో నేను నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో నేను నటిస్తాను అని అనుకోలేదు. ఈ చిత్రంలో ఓ డిఫరెంట్ పాత్రలో కనిపిస్తాను. నా క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే...ఈ చిత్రంలో నా పాత్ర ఓ ప్రయోగమే..!
ఆ గౌరవం దక్కడం అదృష్టం..!
నాన్నగారు విలనిజానికి కొత్త నిర్వచనం చెప్పారు. విలన్ అంటే అప్పటి వరకు డెన్ లో ఉండడం, భారీ ఆకారంతో చూడగానే భయం కలిగేలా ఉన్నట్టు చూపించేవారు. వాటిని బ్రేక్ చేసి కొత్త విలన్ ని పరిచయం చేసారు. దీంతో విలన్ పాత్ర పోషించినా అందర్నీ ఆకట్టుకోవడంతో ప్రతి ఇంట్లోకి వెళ్లిపోయారు. నాన్నగారిలా నన్ను కూడా ప్రేక్షకులు ఓన్ చేసుకోవడం ఆనందంగా ఉంది. మా నాన్న గారిలా ఆ గౌరవం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను.
స్పెషల్ జోన్..
నెగిటివ్ రోల్స్ చేస్తే ఆర్టిస్టుగా మంచి గుర్తింపు రావడానికి అవకాశం ఎక్కువుంటుంది. నేను చేస్తున్న పాత్రలు చేయడానికి వేరే ఆర్టిస్టులు ఉన్నారు అనుకోవడం లేదు. నేను చేయకపోతే ఈ క్యారెక్టర్ ను అతనితో చేయించేద్దాం అనుకోవడానికి లేదు. నాదంటూ ఓ స్పెషల్ జోన్ అని నా ఫీలింగ్.
పరభాషా నటీనటులు పెరగడానికి అదే కారణం..!
పరభాషా నటీనటులకు తెలుగు ఇండస్ట్రీ అవకాశం ఇచ్చినట్టుగా వేరే ఏ ఇండస్ట్రీ అవకాశాలు ఇవ్వదు. మనం పరభాషా నటీనటులు వస్తే రండి అంటూ స్వాగతం చెబుతాం.మనకి మాత్రం ఏ ఇండస్ట్రీ అవకాశాలు ఇవ్వదు. పరభాషా నటీనటులకు మనం అవకాశాలు ఇచ్చినట్టుగా ఇండియాలో ఏ ఇండస్ట్రీ ఇవ్వదు. దానికి కారణం ఏమిటంటే...మిగిలిన భాష వాళ్లు నేటివిటీని మిస్ కారు. కానీ..మనం మాత్రం మన నేటివిటీని పట్టించుకోవడం లేదు. మన పద్దతులును మరిచిపోతున్నాం. మన దగ్గర పుస్తక పఠనం బాగా తగ్గిపోయింది. పుస్తకాలు చదివితే సంస్కృతి, సంప్రదాయం గురించి తెలుస్తుంది. అలా చేయకపోవడం వలనే ఇలా జరుగుతుంది అనేది నా అభిప్రాయం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments